చేయూతనివ్వండి!

17 Feb, 2019 01:26 IST|Sakshi

కాళేశ్వరానికి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం కోరనున్న రాష్ట్రం 

15వ ఆర్థిక సంఘానికి విన్నవించనున్న ప్రభుత్వం 

నేడు ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సంఘం ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం 15వ ఆర్థిక సంఘం తలుపుతట్టనుంది. రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టుకు ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ రానున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించి చేయూతనివ్వాలని కోరనుంది.  

నిర్వహణకే భారీ నిధులు అవసరం... 
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం)కే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల కాలానికి విద్యుత్‌ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి రూ.40,170 కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. వీటిలో విద్యుత్‌ అవసరాల ఖర్చు  రూ.37,796 కోట్లు కాగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374 కోట్లు ఉండనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్‌ అవసరం 4,627 మెగా వాట్లు కాగా, ఇందులో 2020–21 నుంచి విద్యుత్‌ చార్జీల కిందే రూ.2,310 కోట్లు మేర చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.11,220 కోట్లు అవసరం ఉంటుందని లెక్కలేసింది. ఈ నిర్వహణ భారాన్ని కేంద్రమే భరించేలా చూడాలని ప్రభుత్వం కోరనుంది. ఇక ప్రాజెక్టు పనుల కోసం రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరగ్గా, ఇందులో రూ.35,787 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.28,291 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది. మిగతావి ఓఅండ్‌ఎంకు కేటాయించారు. ఇందులో రూ.9,874 కోట్ల మేర ఇప్పటికే తీసుకున్న రుణాలు అందాల్సి ఉంది. ఇవి పోనూ భవిష్యత్తు నిధుల అవసరాలు రూ.18,417 కోట్ల మేర ఉండనున్నాయి. ఇందులోనూ కొంత భారాన్ని కేంద్రం భరించాలని రాష్ట్రం కోరే అవకా శం ఉంది. ఇప్పటికే నీతి ఆయోగ్‌ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా, అలాంటిదేమీ జరగ లేదు. దీంతో ఇప్పుడైనా సానుకూల నిర్ణయం చేయాలని కోరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం కోరేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించాయి.  

నేడు కాళేశ్వరం సందర్శన.. 
15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12కి హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకుని పనులను పరిశీలిస్తారు. తర్వాత ప్యాకేజీ–6లోని పంప్‌హౌజ్‌ పనులను చూస్తారు. అక్కడే ప్రాజెక్టు పనులపై సీఎస్‌ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్‌రావుతో కూడిన బృందం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేయనుంది. అనంతరం మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల పనులను సంఘం ప్రతినిధులు పరిశీలించే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు