డాపౌట్ నుంచి.. ‘డాక్టర్’ దాకా

13 Sep, 2014 00:59 IST|Sakshi
డాపౌట్ నుంచి.. ‘డాక్టర్’ దాకా

ఎంబీబీఎస్ చదువుకు ఆర్థిక అడ్డంకి
 
* కార్డియాలజిస్ట్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నిరుపేద విద్యార్థిని
* చేయూతనందించాలని వేడుకోలు

 
కూలి పనులకు వెళితే గానీ పూట గడవని నిరుపేద  కుటుంబం ఆ విద్యార్థినిది. అందుకేనేమో తనకు తొమ్మిదేళ్లు వచ్చేంత వరకూ బడిబాట ఎరుగదు. అనంతరం మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ (ఎంవీఎఫ్) సహకారంతో ఓనమాలు నేర్చింది. ఇలా గురుకులంలో ప్రవేశం పొంది టెన్త్, ఇంటర్ పట్టుదలతో చదివి ప్రతిభ నిరూపించుకున్న మునగాల మండలం తాడువాయికి చెందిన మాతంగి రజిత ఈ ఏడాది ఎంసెట్ రాసి నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె ప్రస్తుతం తన చదువును కొనసాగించేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
 
పేదప్రజలకు సేవచేస్తా..
పేద కుటుంబంలో పుట్టిన తాను భవిష్యత్‌లో కార్డియాలజిస్ట్‌ను అయ్యి గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తా. నిరుపేద కుటుంబానికి చెందిన నన్ను  ఆదుకుని ఆర్థికసాయం అందిస్తే ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్‌నై సేవచేస్తా.
 - రజిత, ఎంబీబీఎస్ విద్యార్థిని
 
తాడువాయి (మునగాల) :  మునగాల మండలం తాడువాయి గ్రామానికి చెందిన మాతంగి పెద్దులు-అక్కమ్మ దంపతులది నిరుపేద దళిత కుటుంబం. రెక్కాడితే పూట గడవని పరిస్థితి. అయితే పదేళ్ల క్రితం పెద్దులు కాలికి గాయమై కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయించుకునే ఆర్థికస్తోమత లేక ప్రస్తుతం వికలాంగుడిగా మారి ఇంటివద్దనే ఉంటున్నాడు. వీరికి నలుగురు సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, వీరిలో పెద్దకుమారుడు వెంకన్న, పెద్ద కుమార్తె నాగమణికి వివాహాలు అయ్యాయి.
 
రెండో కుమారుడు రమేష్ ప్రస్తుతం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని డీవీఆర్ కళాశాలలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. రెండో కుమార్తె రజిత తొమ్మిదేళ్ల వయస్సు వచ్చే వరకు పాఠశాల అంటే ఎరుగదు. ఈ క్రమంలో 2005లో  ఎంవీ ఫౌండేషన్  సభ్యులు  గ్రామంలో డ్రాపౌట్ పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా రజితను గుర్తించారు. వెంటనే ఆమె తల్లిదండ్రులను ఒప్పించి సంవత్సరం పాటు తమ ఆధీనంలో ఉంచుకుని ఓనమాలు నేర్పించారు.
 
గురుకులంలో ప్రవేశం పొంది..
ఎంవీఎఫ్ వలంటీర్లు 2006లో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షకు రజితను సన్నద్ధం చేశారు. ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణురాలైన రజిత తుంగతుర్తిలోని గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం పొందింది. అక్కడే పదో తరగతి వరకు చదివింది. 2011లో పదో తరగతిలో రజిత 554 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిల్చింది. ఆ విద్యార్థిని తెలివితేటలు, ప్రతిభను గుర్తించిన చిలుకూరు మండలంలోని కవిత జూనియర్ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఉచితంగా ఇంటర్ విద్యనందించింది.
 
ఈ క్రమంలో 2013లో ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 967మార్కులు సాధించి కోదాడ టౌన్ టాపర్‌గా నిల్చింది.  సోదరుడు రమేష్ ప్రోత్సాహంతో  ఈ ఏడాది ఎంసెట్ రాసిన రజిత జనరల్ కేటగిరిలో 6,622, ఎస్సీ కోటాలో 106ర్యాంక్ సాధించింది. ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌లో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందింది.
 
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
ఐదేళ్ల పాటు కొనసాగించాల్సిన వైద్యవిద్యలో ప్రతియేటా రూ.50నుంచి రూ.లక్ష వరకు వ్యయం కానున్నట్లు రజిత సోదరుడు రమేష్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. తన సోదరి డాక్టరు కావాలంటే దయా హృదయం గల దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందిస్తే ఎంబీబీసీ పూర్తి చేయనుందని వేడుకుంటున్నాడు. తమ సోదరి చదువు కోసం ఆర్థికసాయం చేయదల్చుకున్న వారు సెల్ : 87902 53550, 9573962957 నంబర్లలో సంప్రదించాలని, అలాగే మునగాల ఎస్‌బీహెచ్ బ్రాంచి ఖాతా నంబర్‌లో 62364215604లో అమౌంట్‌ను జమచేయవచ్చని కోరుతున్నాడు.

మరిన్ని వార్తలు