మిత్తి..కత్తి!

14 May, 2020 07:13 IST|Sakshi

మెడపై వేలాడుతున్న హోమ్‌లోన్స్, రుణాలు   

సిటీలో పెరుగుతున్నఫైనాన్సియర్ల ఒత్తిళ్లు

నలిగిపోతున్న వ్యాపారులు, ‘మధ్య తరగతి’

వీరి ఆగడాలనుపట్టించుకోని యంత్రాంగం

ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్న బాధితులు

సాక్షి, సిటీబ్యూరో: హోమ్‌లోన్స్‌ సహా ఇతర రుణాలపై మూడు నెలల మారిటోరియం.. అద్దెదారుల నుంచి మూడు మాసాలు వరకు కిరాయి వసూలు చేయవద్దంటూ ఆదేశాలు.. పేదలకు అవసరమైన నిత్యావసరాలు, కొంత నగదు పంపిణీ.. కరోనా నిరోధానికి అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలివీ. ఆచరణలో మాత్రం ఇవేవీ అమలుకు నోచుకోవడంలేదు. నగరంలో లక్షలాది మంది మెడలపై వడ్డీ మాఫియా మిత్తి కత్తి వేలాడుతోంది. ఫలితంగా చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలతో పాటు కొందరు ‘పెద్దలూ’ ఇబ్బందుల పాలవుతున్నారు.  

అక్రమ దందానే అధికం..
నగరంలో సాగుతున్న వడ్డీ వ్యాపారంలో 70 శాతం వరకు అక్రమ దందానే. ఈ వ్యాపారులు ఎలాంటి అనుమతులు తీసుకోరు. తాము చేసే టర్నోవర్‌ పైన, తీసుకుంటున్న వడ్డీపై ఎలాంటి పన్నులు చెల్లించరు. చిన్న స్థాయిలో జరిగే మిత్తి దందానే కాదు.. ప్రతి నెలారూ.లక్షలు, రూ.కోట్లలో లావాదేవీలు నెరిపే కొందరు పెద్ద వ్యాపారులదీ అదే తీరు. వీరిలో అత్యధికులు తమకు పరిచయస్తులకో, వారి ద్వారా పరిచయమైన వారికో మాత్రమే అప్పులు ఇస్తూ ఉంటారు. ష్యూరిటీగా ఖాళీ ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు, చెక్కులతో పాటు ఆస్తి పత్రాలను తమ అధీనంలో ఉంచుకుంటారు. ఇలాంటి దందా చేయడం అక్రమమైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో వీరి వ్యవహరం యథేచ్ఛగా సాగుతోంది.  

ఊహకు అందని వడ్డీ రేట్లు..
వడ్డీ వ్యాపారం నగరంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణ మండలంలోనే అధికంగా ఉంది. దీంతో పాటు మధ్య, తూర్పు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ జోరుగా సాగుతోంది.  రూ.లక్షలు, రూ.కోట్లు అప్పుగా ఇచ్చే వారిలో పశ్చిమ మండలానికి చెందిన ఫైనాన్సియర్లు ఎక్కువగా ఉన్నారు. పెద్ద మొత్తాలు ఇచ్చే వారు నూటికి రూ.3 నుంచి రూ.6 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇక చిరు వ్యాపారులు, మధ్య తరగతి వారికి అప్పులు ఇచ్చేవారిది మరో వ్యవహారం. వీళ్లు రోజు, వారం, నెల లెక్కన తిరిగి చెల్లించే పద్ధతుల్లో అప్పులు ఇస్తుంటారు. ఎవరైనా రూ.50 వేలు అప్పు అడిగితే రూ.39 వేలు మాత్రమే ఇస్తారు. ఈ మొత్తాన్ని వారానికి రూ.1250 చొప్పున 40 వారాలు చెల్లించాల్సి ఉంటుంది. రోజు, నెల చెల్లింపుల వద్దకు వస్తే ఈ చెల్లించే మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. గరిష్టంగా 10 శాతం వరకు వడ్డీగా వసూలు చేస్తుంటారు. 

కుప్పకూలిన వ్యాపారాలతో..
అప్పు తీసుకునే వారికి ఉండే అవసరం.. ఇచ్చే వారి లాభాపేక్ష.. ఈ రెండూ వెరసీ ఇన్నాళ్లూ వడ్డీ దందా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయింది. దాదాపు 50 రోజులుగా నగర వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు స్తంభించిపోయాయి. నిత్యావసర సరుకులు మినహా మరే ఇతర బిజినెస్‌ సాగట్లేదు. ఫలితంగా చేతిలో చిల్లిగవ్వ లేని చిరు వ్యాపారులు, దందాలు ఆగిపోయి పెద్ద వ్యాపారులు సైతం వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి బెదిరింపులు, వేధింపులపై ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనుకాడుతున్నారు.

లాభాల్లో సగానికి పైగా..  
నా వ్యాపారం కోసం ఏ రోజుకా రోజు మిత్తికి డబ్బు తీసుకుంటూ ఉంటాను. ఆ అప్పు కట్టడానికి, వడ్డీతో సహా చెల్లించడానికి సాయంత్రం వరకే గడువు ఉంటుంది. అనివార్య కారణాల వల్ల అలా ఇవ్వలేకపోతే మరుసటి రోజు ఇవ్వాల్సిందే. ఆలస్యం అయితే వడ్డీ పెరుగుతుంది. వ్యాపారం కోసం తీసుకునే అప్పు తీర్చగా.. ఆ వడ్డీ చెల్లించడానికి సగానికి పైగా లాభం ఇచ్చేయాల్సి వçస్తోంది. ఇప్పుడు వ్యాపారాలు లేక తినడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. తక్షణం అసలు, వడ్డీ చెల్లించకపోతే మళ్లీ అప్పు ఇవ్వబోమని, ఇంకెక్కడా పుట్టకుండా చేస్తామని బెదిరిస్తున్నారు.  – దిల్‌సుఖ్‌నగర్‌కుచెందిన చిరు వ్యాపారి

రెట్టింపు కంటే ఎక్కువే ష్యూరిటీ పెట్టా..
ఆంధ్రప్రదేశ్‌ నుంచి నిత్యం వ్యాపారం కోసం హైదరాబాద్‌కు వచ్చిపోతూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌కు చెందిన ఓ ఫైనాన్సియర్‌తో పరిచయం ఏర్పడింది. నాలుగు నెలల క్రితం వ్యాపార అవసరాల కోసం రూ.25 లక్షలు నెలకు నూటికి రూ.8 వడ్డీకి అప్పు తీసుకున్నా. ఆ సమయంలో రూ.70 లక్షల విలువైన కారు, ఆస్తి పత్రాలు ష్యూరిటీగా పెట్టా. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలలుగా వడ్డీ ఇవ్వలేకపోతున్నా. దీంతో ఆ ఫైనాన్షియర్‌ ప్రతి రోజూ ఫోన్‌ చేసి బెదిరించడంతో పాటు వేధిస్తున్నాడు. ఎవరికి చెప్పాలో అర్థం కావడంలేదు.   – విజయవాడకు చెందినఓ బడా వ్యాపారి

మరిన్ని వార్తలు