చెత్త వేస్తే ఫైన్లు తప్పవు

18 Sep, 2019 10:18 IST|Sakshi

దుకాణాల యజమానులు జాగ్రత్తగా ఉండాలి

దుకాణాల ముందు చెత్త వేయడంపై ఆగ్రహం

పట్టణంలో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

సాక్షి, సంగారెడ్డి: రోడ్లపై చెత్త వేస్తే దుకాణాల యజమానులపై ఫైన్లు వేయకతప్పదని కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో ఉన్న కొన్ని దుకాణ సముదాయాలను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల ముందున్న చెత్తను చూసి అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను అపరిశుభ్ర పరిస్తే ఎంతటివారైనా సహించేది లేదని హెచ్చరించారు. కొంతమంది దుకాణదారులకు ఫైన్లు వేశారు.  

ప్రతీ ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హరితహారంలో భాగంగా దుకాణ సముదాయాల ముందు మొక్కలను నాటతామని, వాటిని దుకాణాల యజమానులు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పట్టణాన్ని జోన్లవారీగా విభజించి ప్రతి జోన్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు కలెక్టర్‌ వివరించారు. పట్టణంలో పరిశుభ్రత స్థిరంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శానిటేషన్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు