‘గాంధీ’లో భారీ అగ్నిప్రమాదం

9 Aug, 2019 11:14 IST|Sakshi
సురక్షిత వార్డులకు తరలిన చిన్నారులు, మహిళలు

కాలి బూడిదైన పీడియాట్రిక్‌  సర్జరీ ప్రిపరేషన్‌ వార్డు  

షార్ట్‌ సర్క్యూటే కారణం తప్పిన ప్రాణనష్టం  

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో విలువైన వైద్యపరికరాలు ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వార్డుకు తాళం వేసి ఉండడంతోపాటు పక్కన ఉన్న వార్డులో చిన్నారులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పరిసర ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించడంతో ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని ఇతర వార్డులకు తరలించారు. షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.  వివరాలు ఇలా ఉన్నాయి... ఆస్పత్రి ప్రధాన భవనం మూడో అంతస్తులో పీడియాట్రిక్‌ సర్జరీ వార్డు కొనసాగుతుంది. ఈ వార్డులో న్యూబోర్న్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయు)ను ఏర్పాటు చేశారు.  గురువారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో వార్డులో పెద్దశబ్దం వచ్చింది. ప్రక్కన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించి ఎన్‌ఐసీయు వార్డు తలుపులు, కిటికీలు తెరిచారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్, ఆర్‌ఎంఓ శేషాద్రి ఇతర అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దట్టమైన పొగతోపాటు మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. కిటికీలు, తలుపులు తెరిచి పరిసర వార్డులో చికిత్స పొందుతున్న వారిని సురక్షితమైన వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రీ ప్రిపరేషన్‌ వార్డు తాళాలు పగులగొట్టి మంటలను అదుపుచేశారు. గాంధీ ఆస్పత్రిలో ఫైర్‌ సేఫ్టీ కూడా లేదు.   

బూడిదైన రూ.కోటి విలువైన వైద్యపరికరాలు
ప్రమాదంలో సుమారు కోటి రూపాయల విలువైన వైద్యపరికరాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. వార్డులో అధునాతన యంత్రాలు, నాలుగు ఇంక్యూబేటర్లు, ఆరు మోనిటర్లు, నాలుగు పడకలు, రెండు ఏసీలతోపాటు విలువైన పరికరాలు పనికిరాకుండాపోయాయి.

మరిన్ని వార్తలు