నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

17 Dec, 2018 01:30 IST|Sakshi
మంటల్లో దగ్ధమైన రైలు బోగి

     కాజీపేట జంక్షన్‌లో నిలిపివేత 

     మరమ్మతు చేసి పంపిన మెకానికల్‌ సిబ్బంది

కాజీపేట రూరల్‌: విశాఖపట్నం నుంచి నాందేడ్‌ వెళ్లే నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఉదయం మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన మెకానికల్‌ సిబ్బంది కాజీపేట జంక్షన్‌లో మంటలు ఆర్పి, మరమ్మతు చేసి పంపించారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం.. నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌కు చేరుకున్న సమయంలో ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు, పొగలు వ్యాపించి వాసన రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో సిబ్బంది మంటలను గుర్తించి కాజీపేట రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. ఉదయం 6.45 గంటలకు నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటకు రాగానే మెకానికల్‌ సిబ్బంది హుటాహుటిన ఏసీ కోచ్‌ వద్దకు చేరుకొని పరిశీలించారు. బోగీ కింద ఉన్న బ్యాటరీల్లో మంటలు రావడాన్ని గుర్తించి వెంటనే వాటిని ఆఫ్‌ చేసి మరమ్మతు చేశారు. అనంతరం 7.15 గంటలకు రైలును పంపించారు. ఈ ఘటనతో అరగంట పాటు రైలును కాజీపేట జంక్షన్‌లో నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.  

రైల్వే యార్డులో బోగీ దగ్ధం 
మరో సంఘటనలో కాజీపేట జంక్షన్‌లోని రైల్వే యార్డులో నిలిపి ఉన్న పాత రైలు బోగీలో మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. రైల్వే అధికారుల కథనం ప్రకారం.. యార్డు లో ఒక వైపు గూడ్స్‌ వ్యాగన్లు, మరోవైపు ఆయిల్‌ ట్యాంకర్ల రైలు, కొద్ది దూరంలో వేరే లైన్‌లో కాలం చెల్లిన ప్యాసింజర్‌ కోచ్‌లను నిలిపి ఉంచారు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక పాత బోగీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్‌లో ఉన్న రైల్వే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ లోగా రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని తెల్లవారుజామున 4 గంటల వరకు మంటలు చల్లార్చారు. ఈ ఘటనలో బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ స్వల్పంగా కాలిపోయింది. సికింద్రాబాద్‌ , కాజీపేట రైల్వే అధికారులు కోచ్‌ దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు కాజీపేట రైల్వే పోలీసులు తెలిపారు. 

ఒకే రోజు రెండు ఘటనలు..  
నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, కాజీపేట రైల్వే యార్డులో పాత బోగీ దగ్ధం కావడంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ రెండు ఘటనల్లో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు