అధికారులను హడలెత్తించిన మంటలు

23 Jan, 2019 14:25 IST|Sakshi

మూడు కిలోమీటర్ల మేర వ్యాపించిన మంటలు

రెండు హోటళ్లతోపాటు సోడాబండి ఆహుతి

సాక్షి, రామాయంపేట(మెదక్‌): రామాయంపేట పట్టణశివారులో మెదక్‌ రూటులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం ప్రజలతోపాటు అధికారులను హడలెత్తించింది. సుమారు మూడు కిలోమీటర్లమేర వ్యాపించిన మంటలతో సమీపప్రాంతంలో ఉన్న రైతులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈప్రమాదంలో రెండు పూరిగుడిసెల్లో కొనసాగుతున్న హోటళ్లతో పాటు  సోడాబండి, నిత్యావసర సరుకులు మంటలకు ఆహుతయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. పట్టణశివారులో మెదక్‌ రోడ్డులో ఉన్న బ్రిడ్జివద్ద రోడ్డుపక్కన అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గాలితోపాటు మంటలు వేగంగా వ్యాపించడంతో టీహోటల్‌లో ఉన్న లంబాడి లక్ష్మి, గోపాల్‌ దంపతులు భయాందోళనతో బయటకు పరుగులుతీశారు. ఈ హోటల్‌తోపాటు పక్కనే ఉన్న మ్యాధరి సాయిలుకు చెందిన తాళంవేసి ఉన్న మరో హోటల్‌ సోడాబండి మంటలకు వారికళ్లముందే ఆహుతైనాయి. ఈ ప్రమాదంలో రెండు గుడిసెల్లో ఉన్న బియ్యం, ఫ్యాను, గ్యాస్‌ సిలిండర్, ఇతర వంటసామగ్రి మొత్తం మంటలకు ఆహుతైనాయి.దీనితో మంటలు వేగంగా మూడుకిలోమీటర్లమేర  వ్యాపించడంతో వ్యవసాయబోర్లవద్ద ఉన్న పశువులను వాటి యజమానులు ఆదరాబాదరాగా కట్లువిప్పారు. మంటల ధాటికి తట్టుకోలేక పొదల్లో ఉన్న కుందేళ్లు, ఇతర వణ్యప్రాణులు భయంతో పరుగులుతీయడం కనిపించింది. స్థానిక ఫైర్‌ఇంజన్‌ అందుబాటులో లేకపోవడంతో మెదక్‌ నుంచి వచ్చిన ఫైర్‌ఇంజన్‌ మంటలను ఆర్పివేయగా, చాలా సేపటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. స్థానిక ఎస్‌ఐ మహేందర్‌ దగ్గరుండి మంటలను ట్రాఫిక్‌ను నియంత్రించి మంటలను ఆర్పించారు. స్థానిక ఆర్‌ఐ సత్యనారాయణ సంఘటనాస్థలిని సందర్శించారు. బాధితులకు ఆదుకుంటామని ఆయన హామీఇచ్చారు.

మరిన్ని వార్తలు