న్యుమోనియాతో వస్తే.. ప్రాణాలు పోయాయి

21 Oct, 2019 18:25 IST|Sakshi

షైన్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..ఒక బాలుడు మృతి

పలువురికి గాయాలు.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమం

విచారణ చేపట్టిన జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ అధికారులు

చికిత్స కోసం వస్తే ప్రాణాలు పోయాయంటూ మృతుని తండ్రి ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌లోని షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని ఐసీయూలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం గాయపడ్డ చిన్నారులను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించామని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారని వెల్లడించారు. ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి అగ్ని మాపక అనుమతులు తీసుకోలేదని తమ విచారణలో తేలినట్టు విశ్వజిత్‌ చెప్పారు.
(చదవండి : షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిపై కేసు నమోదు)

నగరంలోని అన్ని ఆసుపత్రులకు అగ్నిమాపక అనుమతుల విషయంపై నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అగ్ని మాపక అనుమతులు లేని ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అగ్ని మాపక అనుమతుల విషయంపై విచారిస్తామని అన్నారు. ఇప్పటికే అగ్నిమాపక అనుమతులు లేని బార్లు, పబ్బులు, స్కూళ్లకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదం నేపథ్యంలో 304A సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, షైన్‌ ఆస్పత్రిని సీజ్‌ చేశారు. ఫైర్‌ సేఫ్టీ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయకుండానే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. వైద్యుడు సునీల్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
(చదవండి : షైన్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం)

గతంలో కూడా ఇలాగే జరిగింది..
చికిత్స కోసం వస్తే ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని షైన్ హాస్పిటల్‌లో చనిపోయిన బాలుడి తండ్రి నరేష్ కన్నీరుమున్నీరయ్యాడు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘న్యుమోనియాతో బాధపడుతున్న నా కుమారున్ని ఈ నెల 17న షైన్ ఆస్పత్రిలో జాయిన్ చేయించాను. యాదాద్రి జిల్లా నుంచి వైద్యం కోసం ఇక్కడికి వచ్చాం. గతంలో కూడా ఇదే హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మళ్లీ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే మా  బాబు చనిపోయాడు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగి ఇన్ని గంటలు కావొస్తున్నా ఆస్పత్రి సిబ్బంది ఎవరూ రాలేదు’అని నరేష్‌ వాపోయారు.

>
మరిన్ని వార్తలు