నాసి..అంతా మసి!

24 Jan, 2019 10:50 IST|Sakshi

బహుళ అంతస్తుల్లో తరచు విద్యుత్‌ ప్రమాదాలు

వాణిజ్య సంస్థల్లో కాలిబూడిదవుతున్న

విలువైన వస్తువులు చలికాలంలో ఘటనలపై అనుమానాలు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇటీవల వెలుగు చూస్తున్న విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉన్న సమయంలో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది. తరచూ కరెంట్‌ వస్తూ పోతుండటం, కేబుల్‌ సామర్థ్యానికి మించి విద్యుత్‌ వినియోగించడం వల్ల ఓవర్‌లోడుతో షార్ట్‌సర్క్యూటవుతుంది. ఈ సయంలో కేబుల్‌ కాలిపోయి నిప్పురవ్వలు ఎగిసిపడటం సహజం. కానీ నిజానికి ఇటీవల విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి హెచ్చుతగ్గులు కానీ, కోతలు కానీ లేవు. నిరంతరాయ విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. అంతేకాదు ఇటీవల చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో గృహ, వాణిజ్య సంస్థల్లో కరెంట్‌ వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పలు వాణిజ్య సముదాయల్లో వరుసగా అగ్నిప్రమాదాలు వెలుగు చూస్తుంటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు ఈ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమా..? లేక ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం యజమానులే తమ ఆస్తులను బుగ్గిపాలు చేసుకుంటున్నారా..? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. 

నాసిరకమే కారణం
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్‌ సర్కిల్‌లో 450పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా వీటిలో 170 ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణంగా అధికారులు నిర్ధారించారు. రూ.11.6 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. సెంట్రల్‌ సర్కిల్‌ పరిధిలో 340కిపైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, వీటిలో 170పైగా ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణమని, ఈ ప్రమాదాల్లో రూ.13.84 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు గుర్తించారు. అదే విధంగా ఈస్ట్‌ సర్కిల్‌ పరిధిలో 277పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, 96 ప్రమాదాలకుషార్ట్‌సర్యూట్‌లే కారణం కాగా రూ. కోట్లలో ఆస్తినష్టం వాటిల్లింది. ఇక నార్త్‌ సర్కిల్‌ పరిధిలో 404 ప్రమాదాలు చోటు చేసుకోగా, వీటిలో 169 ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణమని, రూ.0.28 కోట్ల ఆస్తినష్టం వాటి ల్లినట్లు గుర్తించారు. నిజానికి ఇప్పటి వరకు గ్రేటర్‌లో వెలుగు చూసిన విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌లకు నాసిరకం వైరింగే కారణంగా విద్యుత్‌ తనిఖీ శాఖ గుర్తించింది. అయితే కొంతమంది ఇన్సూరెన్స్‌ డబ్బులతో నష్టాల నుంచి గట్టేక్కేందుకు కావాలనే ఆస్తులను కాల్చేసి, వాటికి షార్ట్‌సర్క్యూట్‌లను కారణంగా చూపుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.  

నాణ్యమైన వైరింగ్‌తోనే రక్షణ
నిర్మాణ సమయంలోనే భవిష్యత్తు అవసరాలను గుర్తించి, ఆ సామర్థ్యం మేర వైరింగ్‌ను ఎంచుకోవాలి. స్విచ్‌లు, బోర్డులు, ఫ్యూజ్‌లు, వైరింగ్‌ వంటి విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దు. మార్కెట్లో రకరకాల వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు దొరుకుతున్నాయి. ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన వస్తువులనే ఎంచుకోవాలి. తక్కువ ధరకే వస్తున్నాయి కదా? అని నాసిరకం వైరింగ్‌ను ఎంచుకోవద్దు. ఇంటి వైరింగ్‌కు ఎర్తింగ్‌ తప్పనిసరి. స్విచ్‌ ఆఫ్‌ చేయకుండా ప్లగ్‌లను బయటకు తీయొద్దు.  – నక్క యాదగిరి, విద్యుత్‌రంగ నిపుణుడు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు