మృత్యుంజయురాలు దివ్య..

22 Apr, 2019 08:14 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన కచ్చామోరీ, చిన్నారిని కాపాడిన ఫైర్‌ సిబ్బంది

కచ్చామోరీలో పడ్డ చిన్నారి

రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

సుల్తాన్‌బజార్‌: నాలుగేళ్ల దివ్య.. మృత్యుంజయురాలై తిరిగొచ్చింది..తమ కుమార్తె అంత ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో బయటకు రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ అసలేం జరిగిందంటే..గౌలిగూడ టెలిఫోన్‌ కేంద్రం వద్ద చంద్రకాంత్‌ అనే కార్పెంటర్‌ నివాసముంటున్నాడు. ఇతనికి వెన్నెల(8), దివ్య(4) ఇద్దరు కూతుళ్లు. ఆదివారం ఉదయం చిన్నారులిద్దరూ టిఫిన్‌ తినేందుకు టెలిపోన్‌ కేంద్రం వద్దకు వచ్చారు. తరువాత ఇంటికి వెళుతుండగా దివ్య మూత్ర విసర్జనకు వెళ్లింది. అయితే అక్కడే కచ్చామోరీపై పెద్ద రంధ్రం ఉంది.ఇది గమనించకపోవడంతో దివ్య అందులో పడిపోయింది. గమనించిన స్థానికులు  వెంటనే అగ్నిమాపక శాఖ కేంద్రం అధికారి రాజకుమార్‌ గౌడ్‌కు సమాచారం అందించారు.  

ఫైర్‌సిబ్బంది క్రాంతికుమార్, సురేష్, రమణ, వసంతరావులు అక్కడికి చేరుకుని నిచ్చెన, తాడుతో క్రాంతికుమార్‌ కాలువలోపలికి దిగారు.లోపల చిన్నారి కనిపించకపోవడంతో కాసేపు ఆందోళన చెందారు.తరువాత ఏడుపు వినిపించడంతో టార్చ్‌లైట్‌తో మొత్తం వెతికారు. కాలువలో కొద్ది దూరంలోనే బురదలో కూర్చుని ఏడుస్తూ కనిపించింది. దీంతో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కూతురు క్షేమంగా బయటకు రావడంతో ఆ తల్లిదండ్రులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు