సరికొత్త వెలుగులు

6 Jun, 2020 04:33 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎండీ ప్రభాకర్‌రావు

బీటీపీఎస్‌ మొదటి యూనిట్‌లో సీవోడీ విజయవంతం 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌) రాష్ట్రానికి వెలుగులు అందించడం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక–మణుగూరు సరిహద్దులో 1,080 మెగావాట్ల (270‘‘4) విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్‌లో శుక్రవారం మొదటి యూనిట్‌ నుంచి సీవోడీ (కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌) ప్రక్రియ విజయవంతం అయింది. దీంతో బీటీపీఎస్‌ నుంచి రాష్ట్రానికి ఇక నుంచి నిరంతరాయంగా వెలుగులు అందనున్నాయి. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీటీపీఎస్‌ మొదటి యూనిట్‌ నుంచి గంటకు 19.556 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి కానున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.

2015 ఏప్రిల్‌ 23న సీఎం కేసీఆర్‌ బీటీపీఎస్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల్లో బీటీపీఎస్‌ మొదటిది. బీహెచ్‌ఈఎల్‌ సంస్థకు జెన్‌కో నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సీవోడీ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి యూనిట్‌ నుంచి 2019 సెప్టెంబరు 19న సింక్రనైజేషన్‌  ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా సీవోడీ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ విజయవంతం గా పూర్తి చేశారు. ఈ నెల 2వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతం కావడంతో సీవోడీ ప్రక్రియ పూర్తయింది. ఇక రెండు, మూడు యూనిట్ల నిర్మాణం సైతం 70 శాతం పూర్తయినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.

కొత్త  సేవలపై  హర్షం 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఉన్న కేటీపీఎస్‌ (కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌) ఆరు దశాబ్దాలుగా రాష్ట్రానికి వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. అయితే ఇందులో 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన కాలం చెల్లిన ఓఅండ్‌ఎం (1,2,3,4 దశలు) ప్లాంట్లను గత మార్చి 31న మూసివేశారు. వీటిని నిర్మించి 50 ఏళ్లు దాటడంతో నిబంధనల మేరకు మూసివేశారు. అయితే కేటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 7వ దశ ప్లాంట్‌ అందుబాటులోకి రావడంతో సమస్య తీరింది. 2018 డిసెంబర్‌ 26న కేటీపీఎస్‌ 7వ దశ సీవోడీ ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రస్తుతం (720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్‌ 1, 2, 3, 4 దశలు మూసేశాక) ఇక్కడి నుంచి 7వ దశతో కలుపుకొని 1,800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. తాజాగా భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ మొదటి యూనిట్‌ నుంచి 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రస్తుతం 2,070 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చినట్లయింది.  కాగా బీటీపీఎస్‌ విజయవంతం కావడంతో సిబ్బందికి సీఎండీ ప్రభాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా