పగిడిద్దరాజు పెళ్లి కొడుకాయె..

5 Feb, 2020 04:22 IST|Sakshi
శివసత్తుల పూనకాల నడుమ పగిడిద్దరాజు పడిగెతో పూజారులు 

నేడు మేడారంలో సమ్మక్కతో వివాహం

గంగారం: గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఆరాధ్య దైవమైన సమ్మక్కను వివాహం చేసుకునేందుకు పెళ్లి కుమారుడిగా తయారైన పగిడిద్దరాజు మేడారానికి బయలుదేరాడు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామానికి చెందిన పగిడిద్దరాజుకు భక్తి శ్రద్ధల నడుమ పూజలు నిర్వహించిన పూజారులు.. కాలి నడకన మేడారం బయలుదేరారు. వరుడు పగిడిద్దరాజు ఇంటి వద్ద చేయాల్సిన కార్యక్రమాలను పెనక వంశీయుల వడ్డెలైన కల్తి వంశీయులు నిర్వహించారు. పూనుగొండ్లలో మొదట పగిడిద్దరాజు పాన్పును తీసుకువచ్చాక వడ్డె ఇంటి వద్ద మహిళలతో ముగ్గులు వేయించారు.

అనంతరం మేక, పాన్పుతో గ్రామ పురవీధుల గుండా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద మేకపోతును బలిచ్చి పగిడిద్దరాజుకు నైవేద్యం సమర్పించారు. దేవాలయంలో ఉన్న పడిగెను తీసి దేవుని గుట్ట నుంచి తీసుకువచ్చిన వెదురు కర్ర కట్టి గద్దెపై ప్రతిష్ఠించారు. దేవాలయంలో పగిడిద్దరాజు గద్దె వద్ద పసుపు, కుంకుమ చల్లి శుద్ధి చేశారు. అనంతరం పడిగెతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గ్రామం దాటే వరకు ఆదివాసీ సంప్రదాయాల నడుమ, డోలు, డప్పులు వాయిద్యాలతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, వడ్దెలతో ర్యాలీ నిర్వహించారు. పగిడిద్దరాజు పడిగె వస్తుండగా.. పూజారుల కాళ్లు తడిపి తరించేందుకు గ్రామ మహిళలు బిందెలతో నీళ్లు ఆరబోశారు. పగిడిద్దరాజు వెళ్లేటప్పుడు అధిక సంఖ్యలో భక్తులు కాలి నడకన బయలుదేరి వెళ్లారు.

కాలినడకనే బయలుదేరిన పగిడిద్దరాజు 
పగిడిద్దరాజు పడిగెతో పూజారులు పూనుగొండ్ల నుంచి అటవీ మార్గం గుండా 80 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి ములుగు జిల్లా కర్లపల్లి సమీపంలోని లక్ష్మీపురానికి మంగళవారం రాత్రి చేరుకుంటారు. గ్రామంలోని పెనక వంశీయుల ఇంటి వద్ద సేద తీరి బుధవారం తెల్లవారుజామున స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కర్లపల్లి, నార్లాపూర్, వెంగ్లపూర నుంచి మేడారానికి సాయంత్రంలోగా చేరుతారు. అక్కడ  సమ్మక్క – పగిడిద్దరాజు వివాహం జరిపిస్తారు. కాగా, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ అల్లెం రామ్మూర్తి తదితరులు దర్శించుకుని పూజలు చేశారు.

మరిన్ని వార్తలు