‘ప్రజావాణి’కి మంచి రోజులొచ్చేనా..!

10 Feb, 2020 10:05 IST|Sakshi
కలెక్టర్‌ శ్వేతా మహంతి

ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహణ

జిల్లా స్థాయి అధికారుల గైర్హాజరు

ఫిర్యాదుల పరిష్కారమూ అంతంతే..

కొత్త కలెక్టర్‌ శ్వేతా మహంతి  పాలనపై కోటి ఆశలు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం గాడిలో పడుతుందా ? ప్రజల సమస్యల పరిష్కారానికి మోక్షం లభిస్తుందా ? జిల్లా స్థాయి అధికారుల్లో మార్పు వస్తుందా ? అధికారుల ఆదేశాలు అమలవుతాయా? అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి పని చేయిస్తూ తాను పనిచేసే అధికారిగా ముద్ర వెసుకున్న శ్వేతా మహంతి  జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత రెండేళ్లుగా జిల్లా పాలనా యంత్రాంగమే కంచె చేను మేసిన విధంగా వ్యవహరించడంతో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారింది. సాక్షాత్తూ పాలనాధీశులు ప్రజావాణి కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి కనబర్చకుండా జాయింట్‌ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం, జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరు కావడం, ప్రజా ఫిర్యాదుల నిర్లక్ష్యానికి మరింత కారణమైంది. ప్రజాసమస్యలు పరిష్కారం కాదు కదా. అసలు వినేవారే కరువయ్యారు. మరోవైపు కార్యక్రమానికి సమయపాలన లేకుండా పోయింది. కొన్నిసార్లు కింది స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించగా.. మరికొన్ని సార్లు ఆర్జీదారులకు పడిగాపులు తప్పడం లేదు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం సడిలి క్రమంగా అర్జీదారుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది.

ఆదేశాలు సైతం బేఖాతర్‌..
ప్రజావాణిలో ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం అతంత మాత్రంగానే అమలవుతున్నాయి. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రజావాణిలో పదే పదే జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని,  అర్జీలను  ప్రాధాన్యత క్రమంలో  పరిష్కరించేందుకు వ్యక్తిగత శ్రద్ద కనబర్చాలని ఆదేశిస్తూ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి  నివేదిక  అందజేయాలని, పరిష్కరించిన  వినతి పత్రాల వివరాలను శాఖల వారిగా  తమ లాగిన్‌ ఐడీతో  మీ కోసం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచనలు సైతం అమలు కాలేదు. మరోవైపు పాలనా యంత్రాంగం వద్ద ఇప్పటి వరకు ఎన్ని ఆర్జీలు వచ్చాయి. ఎన్నిపరిష్కారమయ్యాయి. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయన్న వివరాలు అందుబాటులో లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

మార్క్‌ ఉంటుందా..?
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ స్వయంగా పాల్గొని ప్రజల ఆర్జీలను స్వీకరిస్తారా..? లేక గత కలెక్టర్ల మాదిరిగా కార్యక్రమ బాధ్యతలు జాయింట్‌ కలెక్టర్‌కు అప్పగిస్తారా..? కొత్త  కలెక్టర్‌  శ్వేతా మహంతి కొంత శ్రద్ధ కనబర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పనిచేసిన ప్రాంతంలో ప్రజావాణిపై ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చారు. ప్రజావాణికి క్రమం తప్పకుండా హాజరై ప్రజా ఫిర్యాదులు, సమస్యలు వినడమే కాకుండా సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజావాణి సమయం మించి పోయినా.. తన చాంబర్‌లో సైతం ఫిర్యాదుల స్వీకరించే అధికారిగా ఆమెకు పేరుంది. ప్రజావాణి కార్యక్రమానికి  గైర్హాజరయ్యే జిల్లా స్థాయి అధికారులకు తీవ్రంగా మందలిచినట్లు తెలుస్తోంది. ప్రజా ఫిర్యాదుల ఆప్‌డేట్, ప్రతివారం వాటి పురోగతిపై  సమీక్ష నిర్వహించే అలవాటు ఉండడంతో జిల్లా స్థాయి అధికారుల్లో గుబులు పట్టుకుంది. కొత్త కలెక్టర్‌ పాలనా పగ్గాలు చేపట్టడంతో ప్రజావాణి గాడిలో పడి అధికారుల్లో మార్పు వస్తుందనే ఆశలు ప్రజల్లో చిగురిస్తున్నాయి.

మరిన్ని వార్తలు