ప్రశాంతంగా ఎంసెట్

15 May, 2015 00:32 IST|Sakshi

నల్లగొండ: జిల్లాలో ఎంసెట్-2015 ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నల్లగొండ, కోదాడ పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 10,330 మంది విద్యార్థులకుగాను 9,506 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 90 శాతం హాజరు నమోదయింది. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో మొత్తం 15 సెంటర్లలో 7,051 మంది విద్యార్థులకు గాను  6,501 మంది హాజరయ్యారు. ఈ విభాగంలో 92.5 శాతం హాజరు నమోదయింది.
 
  జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ, నీలగిరి డిగ్రీ, పీజీ కాలేజీ సెంటర్లలో ఎంసెట్ నిర్వహణను కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఏజేసీ నిరంజన్, ఎంసెట్ కో - ఆర్డినేటర్ రావుల నాగేందర్‌రెడ్డి తదితరులున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఇంజనీరింగ్ పరీక్షకు జిల్లా కేంద్రంలో ఒక విద్యార్థి, కోదాడలో ఇద్దరు విద్యార్థులు నిమిషం నిబంధన కారణంగా పరీక్ష రాలేకపోయారు. సమయం ముగిసిన తర్వాత వచ్చిన ఈ ముగ్గురిని అధికారులు అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. మొత్తంమీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎంసెట్ సజావుగా ముగిసింది.
 
 పట్టణాల వారీగా...
 జిల్లా కేంద్రమైన నల్లగొండలో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం 15 సెంటర్లను ఏరా్పాటు చేశారు. ఆయా సెంటర్లలో మొత్తం 7,195 మంది విద్యార్థులు అలాట్‌కాగా 6,835 మంది హాజరయ్యారు. 356 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదే విధంగా కోదాడలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,135 మంది విద్యార్థులకు గాను 2,671 మంది హాజరుకాగా 464 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వర కు మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం నల్లగొండలో 9 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా 4,767 మంది విద్యార్థులు అలాట్ అయ్యారు. అందులో 4,494 మంది హాజరుకాగా 273 మం ది గైర్హాజరయ్యారు. కోదాడలో 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,284 మంది విద్యార్థులకుగాను 2,087 మంది మంది విద్యార్థులు హాజరయ్యారు. 197 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 92.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
 
 ఆ.. ముగ్గురు
 నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థి నిమిషం నిబంధన కారణంగా ఇంజనీరింగ్ పరీక్షకు హాజరుకాలేకపోయారు. నిడమనూరు మండలం భోజ్యాతండాకు చెందిన ధనావత్ శ్రీహరి అనే విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు అతడిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. తనకు వాహనాలు సకాలంలో అందనందున రాలేకపోయానని విద్యార్థి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా అధికారులు అనుమతించకపోవడంతో అతను నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ తన ఊరి నుంచి మిర్యాలగూడ వచ్చేందుకు ఆటోలు సమయానికి రాలేదని, అందుకే ఆలస్యం అయిందన్నాడు. కోదాడలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల సెంటర్‌లో నిమిషం ఆల స్యంగా రావడంతో నూతనకల్ మండలం చిల్పకుంట్లకు చెందిన కట్టా ఉపేందర్‌రెడ్డిని, మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మునగాల మండలం జగన్నాథపురానికి చెందిన రెడ్డిబోయిన ఉమలను అధికారులు పరీక్షకు అనుమతించలేదు.
 
 కిటకిటలాడిన రోడ్లు...
 ఎంసెట్ రాసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహాయకులు జిల్లాకేంద్రమైన నల్లగొండతో పాటు కోదాడకు తరలిరావడంతో రెండు పట్టణాలు కళకళలాడాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి వేచి ఉన్నారు. ఉదయం నుంచే పలు గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే బస్సులు ఎంసెట్‌కు వచ్చే వారితో కిటకిటలాడాయి. పరీక్షా సమయాలకు అనుగుణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా భోజనాలు చేయాల్సి రావడంతో రెండు పట్టణాల్లోని హోటళ్లలో సందడి నెలకొంది. సరిగ్గా ఎంసెట్ జరిగే రోజుకు ఆర్టీసీకార్మికులు సమ్మె విరమించడంతో పా టు ఎంసెట్ కోసం ప్రత్యేక  బస్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 దూరంగా ఉన్న రెండు సెంటర్లతో ఇబ్బంది
 కోదాడ టౌన్ :కోదాడ పట్టణానికి దాదాపు 13 కిలో మీటర్ల దూరంలో ఉన్న మిట్స్ కళాశాలను, 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనురాగ్ కళాశాలలను సెంటర్‌గా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు కొంత  ఇబ్బంది  పడ్డారు. మిట్స్ కళాశాల చిలుకూరు మండలంలో ఉండడంతో పలువురు కోదాడకు వచ్చి సెంటర్ విషయమై ఆరా తీయడం కనిపించింది. ఈ సెంటర్ చిలుకూరు మండలంలో ఉందని తెలుసుకొని ఉరుకులు,పరుగులు పెట్టారు.
 

>
మరిన్ని వార్తలు