ఆధునీకరిస్తేనే వెలుగు

3 Oct, 2017 13:23 IST|Sakshi
నిజాంసాగర్‌ ప్రాజెక్టు..విద్యుత్తు ఉత్పత్తి చేసే టర్బయిన్లు

ఉనికి కోల్పోతున్న ‘తొలి జల విద్యుత్‌ కేంద్రం’

కామారెడ్డి నుంచి సేపూరి వేణుగోపాలచారి : రాష్ట్రంలోనే తొలి జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఆధునీకరిస్తే మరిన్ని వెలుగులు వెదజల్లుతుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద  మొదటి జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. 1954లో ప్రాజెక్టు హెడ్‌స్లూయిస్‌ వద్ద జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. 1954 ఫిబ్రవరి 23న తొలి యూనిట్‌ను, 1955 నవంబర్‌ 28న రెండో యూనిట్‌ను, తర్వాత కొంతకాలానికే మూడో యూనిట్‌ను ప్రారంభించారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో రూ.2.27 కోట్లు ఖర్చు చేశారు.

ఇంగ్లండ్‌లో తయారైన మూడు టర్బయిన్లు తీసుకొచ్చి 15 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నెలకొల్పారు. ఒక్కో టర్బయిన్‌ ద్వారా ఐదు మెగావాట్ల లెక్కన రోజుకు 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా నిర్మించారు. మూడో టర్బయిన్‌లో సాంకేతిక సమస్య  తలెత్తి 1968 నుంచి పది మెగావాట్ల కరెంటు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి పంటలకు విడుదల చేసే నీటి ఆధారంగా ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

కొద్దిపాటి మరమ్మతులు చేస్తే..
నిజాంసాగర్‌ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి కొద్దిపాటి నిధులు సమకూర్చి ఆధునీకరించాల్సి ఉంది. మూలన పడిన మూడో టర్బయిన్‌ను వినియోగంలోకి తీసుకొస్తే మరో ఐదు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. పూర్తిస్థాయి నీటి వనరులు అందుబాటులో ఉండడం, విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ నిర్మితమై ఉండడంతో ఇక్కడ అదనపు విద్యుత్‌ ఉత్పత్తి సులభం.

మరిన్ని వార్తలు