ఇండస్ట్రీ ఇన్ సిటీ @1857

15 Aug, 2018 07:37 IST|Sakshi

పాతబస్తీలోని సుల్తాన్‌షాహీలో పరిశ్రమలు   

మొదట నాణేల తయారీ కర్మాగారం 

అగ్గిపెట్టెల తయారీ తొలి కుటీర పరిశ్రమ  

1918లో ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా ఏర్పాటు

తొలి మెషినరీ పరిశ్రమ సిగరెట్ల తయారీ  

పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామంగా భావిస్తున్న భాగ్యనగరంలో... వీటి ఏర్పాటుకు పునాది స్వాతంత్య్రానికి ముందే పడింది. కుతుబ్‌షాహీల పాలనా కాలంలో పాతబస్తీలోని సుల్తాన్‌షాహీలో పరిశ్రమల ఏర్పాటుకు బీజం పడింది. ఇక్కడ నాణేలు, ప్రభుత్వ లోగోలు ముద్రించేవారు. తర్వాత్తర్వాత ఇతర ప్రైవేట్‌ పరిశ్రమలు వెలిశాయి. నగరం విస్తరించడంతో ఆ ప్రాంతం ఇరుకుగా మారింది. దీంతో ఏడో నిజాం హయాంలో నగర శివారులోని బాకారం గ్రామంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు 1918లో అనుమతిచ్చారు. ఆజామాబాద్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియా పేరుతో నెలకొల్పిన ఈ ప్రాంతం ఏర్పడి వందేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నగరంలో పరిశ్రమల ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి, సిటీబ్యూరో : 1857 వరకు మన దేశంలో మొగల్‌ నాణేలు వినియోగించేవారు. మొగల్‌ సామ్రాజ్య పతనం తర్వాత బ్రిటీష్‌ నాణేలు వినియోగంలోకి వచ్చాయి. కానీ ఆసఫ్‌జాహీ పాలకులు హైదరాబాద్‌ సంస్థానంలో అదే ఏడాది సొంత నాణేల తయారీ ప్రారంభించారు. ఐదో నిజాం అఫ్జలుద్దౌలా సుల్తాన్‌షాహీలో నాణేల తయారీ కర్మాగారం ఏర్పాటు చేశారు. అలా నగరంలో తొలి పరిశ్రమ ప్రారంభమైంది. తర్వాత వివిధ రకాల వస్తువుల తయారీ పరిశ్రమలు ఇక్కడ ఏర్పడ్డాయి. 

అగ్గిపెట్టెలతో ఆరంభం..  
అగ్గిపెట్టెలతో తయారీతో నగరంలో తొలి కుటీర పరిశ్రమ ప్రారంభమైంది. అప్పట్లో అగ్గిపెట్టెలు ఉండేవి కావు.  కుతుబ్‌షాహీల కాలంలో విదేశాల నుంచి నగరానికి వచ్చే వ్యాపారులు కొందరు అగ్గిపెట్టెలు దిగుమతి చేసుకొని విక్రయించేవారు. అయితే సుల్తాన్‌షాహీలో పరిశ్రమల ఏర్పాటుతో అగ్గిపెట్టెల తయారీ ఉనికిలోకి వచ్చింది. కానీ పూర్తిస్థాయిలో ఇక్కడే తయారయ్యేవి కాదు. అగ్గిపెట్టెల తయారీకి కావాల్సిన ముడి సరుకును దిగుమతి చేసుకునేవారు. మహిళలకు శిక్షణనిచ్చి ఇళ్లలోనే తయారు చేయించేవారు. ఇలా నగరంలో తొలి కుటీర పరిశ్రమగా అగ్గిపెట్టెల తయారీ ప్రారంభమైంది. ఇక తర్వాత వివిధ రకాల వస్తువుల కుటీర పరిశ్రమలు మొదలయ్యాయి. చాలా రోజుల వరకు ఇవి నడిచాయి. అయితే ప్రస్తుతం టెక్నాలజీ దెబ్బకు కుటీర పరిశ్రమలన్నీ మాయమయ్యాయి.  

నిజాం కుమారుడి పేరుతో...  
సుల్తాన్‌షాహీలో ఏర్పాటైన పరిశ్రమలు ఎక్కువగా కార్మిక శక్తి మీద ఆధారపడినవే. యంత్ర సామగ్రి అందుబాటులోకి తేవాలని, టెక్నాలజీకి అనుగుణంగా నగరంలోనూ పరిశ్రమలు ఉండాలని ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భావించారు. ఇందుకు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఉత్తర, దక్షిణ భారత్‌లోని బ్రిటీష్‌ ఆధ్వర్యంలోని పరిశ్రమలను సందర్శించి నిజాం నవాబ్‌కు నివేదిక అందజేసింది. అనంతరం నగర శివారులోని బాకారం గ్రామంలో తన పెద్ద కుమారుడు ఆజామబాద్‌ పేరుతో  1918లో నిజాం ఇండస్ట్రీయల్‌ ఏరియాను స్థాపించారు.  

ఇప్పుడెన్నో...  
ఒకప్పుడు సుల్తాన్‌షాహీ, ఆజామాబాద్‌... ఇలా నగరంలో రెండే పారిశ్రామిక ప్రాంతాలుండేవి. ప్రస్తుతం నగర శివార్లలోని చాలా ప్రాంతాలు పారిశ్రామిక వాడలుగా మారాయి. అంతేకాదు నగరం మధ్యలోని కాటేదాన్, బాలానగర్, సనత్‌నగర్, చర్లపల్లి ఇలా ఎన్నో పారిశ్రామిక ప్రాంతాలున్నాయి.   

తొలిసారి సిగరెట్‌ ఫ్యాక్టరీ...
ఆజామాబాద్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియా స్థాపనలో బెంగళూర్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అబ్దుల్‌ సత్తార్‌ కీలక పాత్ర పొషించారు. ఆ ఏరియాలో ఎక్కడ? ఏ పరిశ్రమ స్థాపించాలనే దానిపై నిజామ్‌కు ఆయన వివరించారు. అప్పటికే విఠల్‌వాడీలో బ్రిటీషర్ల సౌజన్యంతో వజీర్‌ సుల్తాన్‌ సిగరెట్‌ ఫ్యాక్టరీ ఉండేది. తొలిసారి ఇక్కడ గోల్కొండ సిగరెట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అప్పట్లో సిగరెట్లను విదేశాల నుంచి లేదా ఆంగ్లేయుల కంపెనీల నుంచి దిగుమతి చేసుకునేవారు. అయితే పొగాకు పంట మన దగ్గరే ఎక్కువగా పండించేవారు. పొగాకు పంట పుష్కలంగా ఉండడంతో నగరంలోనే సిగరెట్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని.. మనపై ఆంగ్లేయుల పెత్తనం ఇక ఉండకూడదని నిజాం భావించారు. దీంతో ఆజామాబాద్‌లో సిగరెట్‌ తయారీ పరిశ్రమ నెలకొల్పారు. అనంతరం ఆగ్రవాల్‌ పైప్స్, రహెమానియా గ్లాస్‌ తదితర పరిశ్రమలు ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు