ఇకపై ఈ-పంచాయతీలు

12 May, 2014 01:08 IST|Sakshi

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రజలకు పారదర్శక, వేగవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీలను ‘ఈ-పంచాయతీలు’గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో గ్రామపంచాయతీల ద్వారా అందే అన్ని సేవలు ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారానే అందనున్నాయి. అలాగే పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం మొదటి విడతగా జిల్లాలోని 141 గ్రామపంచాయతీలకు కంప్యూటర్లను మంజూరు చేశారు.

 పారదర్శక పాలన కోసం
 మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా పాలనలో సంస్కరణలు అవసరమవుతున్నాయి. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంత ప్రజలకు పారదర్శక పాలనను అందించేందుకు పంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 866 గ్రామపంచాయతీలు ఉండగా, మొదటి విడతగా 141 కార్యాలయాలకు కంప్యూటర్లను మంజూరు చేశారు. మండల పరిషత్ కార్యాలయాలకు సైతం ఒక్కో కంప్యూటర్‌ను అందించారు.

కంప్యూటర్‌తో పాటు ప్రింటర్‌ను కూడా అందించారు. మంజూరు చేసిన కంప్యూటర్లను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అమర్చి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించారు. కంప్యూటర్ ఆపరేటర్‌ను సైతం ప్రైవేటు సంస్థనే ఏర్పాటు చేయనుంది. రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక ఆపరేటర్‌ను ఎంపిక చేయనున్నారు. వారంలో మూడు రోజులు ఒక గ్రామంలో, మరో మూడు రోజులు మరో గ్రామంలో ఆపరేటర్ అందుబాటులో ఉండి విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల విధులు, కోడ్ అమల్లో ఉన్నందున వచ్చే నెలలో అధికారికంగా పంచాయతీల్లో కంప్యూటర్లను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు