అక్కర్లేని చెరువులకూ తొలి ప్రాధాన్యం

30 Mar, 2018 02:30 IST|Sakshi

గతంలో చేపట్టిన పనులనే ‘మిషన్‌’లోనూ చేపట్టారు 

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ అమలులో లోపాలున్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ఎత్తిచూపింది. తొలి రెండుదశల్లో ప్రాధాన్యంలేని చెరువులను కూడా చేపట్టారని ఆక్షేపించింది. ప్రాధాన్య చెరువుల జాబితాలో మినీ ట్యాంక్‌బండ్‌లు లేకున్నా వాటికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.66.31 కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. మినీ ట్యాంక్‌బండ్‌లను ఆహ్లాదం కోసం చేపట్టినందున వాటిని ప్రాధాన్యం గల పనులుగా పరిగణించలేమని పేర్కొంది. గురువారం ఉభయసభల్లో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికల్లో మిషన్‌ కాకతీయ తప్పిదాలు వెలుగు చూశాయి. గతంలో కమ్యూనిటీ బేస్డ్‌ ట్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం కింద 186 చెరువులు, ట్రిపుల్‌ కింద మరో 116 చెరువులను చేపట్టగా, వాటినే తిరిగి మిషన్‌ కాకతీయలోనూ రూ.120.41 కోట్లతో చేపట్టారని పేర్కొంది.

గత పథకాల్లో పూడికతీయనంత మాత్రాన ఈ పనులు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని, గత పథకాల్లో కొన్ని అంశాలు లేనందున మళ్లీ చేపట్టేందుకు మార్గదర్శకాలు అనుమతించవని తెలిపింది. 27 చెరువుల పూడికతీత పనులు తనిఖీ చేయగా, అంచనా వేసిన పరిమాణం కన్నా తక్కువగా పనులు జరిగాయని వెల్లడించింది. 27 చెరువుల పనుల్లో 12.01 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని చేయాలని అంచనా వేసి కేవలం 8.08 లక్షల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే తీశారని పేర్కొంది.

పూడికతీత తగ్గుదల కారణంగా ఆశించిన విధంగా చెరువుల నిల్వ సామర్థ్యం పునరుద్ధరించబడినట్లు ధ్రువీకరించలేమని స్పష్టం చేసింది. వ్యవసాయ భూములకు పనికి రానందునే పూడికమట్టిని తీసుకెళ్లేందుకు రైతులు ఆసక్తి చూపలేదన్న ప్రభుత్వ సమాధానం అంగీకారం కాదని స్పష్టం చేసింది. మిషన్‌ కాకతీయలో 10 లక్షల ఎకరాల గ్యాప్‌ ఆయకట్టును తిరిగి సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే పనుల అంచనాల్లో ఎక్కడా గ్యాప్‌ ఆయకట్టు వివరాలు లేవని తెలిపింది. మెదక్, వికారాబాద్‌లో రెండో దశలో 100 % ఆయకట్టును సాధించామని ప్రకటించారని, అయితే అక్కడ 936 చెరువులకుగానూ 446 చెరువుల పనులు మాత్రమే పూర్తి అయ్యాయని కాగ్‌ నివేదిక తెలిపింది.    

మరిన్ని వార్తలు