‘స్థానికం’లోనూ ఈవీఎంలు

24 May, 2015 23:54 IST|Sakshi
‘స్థానికం’లోనూ ఈవీఎంలు

 మొదటిసారి ప్రయోగాత్మకంగా అమలుకు కసరత్తు
 వచ్చే నెల జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు
 వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ, డీపీఓ సమావేశం
 
 నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) వినియోగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన సర్పంచ్ స్థానాలు-13, జెడ్పీటీసీ-1, ఎంపీటీసీ-1, వార్డులు-46 ఉన్నాయి. దీంట్లో నకిరేకల్ పంచాయతీ రిజర్వేషన్ ఎటూ తేలకపోవడంతో ఎన్నికల జాబితాలో ఆ గ్రామ పంచాయతీని చేర్చలేదు. అదే విధంగా బొమ్మలరామారం మండలం కంచల్ తండాలో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ ఉంటుంది. ఈ రెండు మినహా మిగిలిన 11 సర్పంచ్ స్థానాలకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ  రెండు స్థానాలకు  ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈవీఎంల వాడకం ఈ ఎన్నికల్లో విజయవంతమైతే రా బోయే రోజుల్లో ఈవీఎంల సహాయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు.
 
 ఒక్కో ఈవీఎం సామర్థ్యం 12 వందల ఓట్లుకాగా.. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నందున 650 ఓట్లకు ఒక ఈవీఎం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. సర్పంచ్ స్థానాలకు 33 ఈవీఎంలు అవసరంగా కాగా అదనంగా మరో 18 ఈవీఎంలను అందుబాటులో ఉంచనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 42 ఈవీఎంలు అవసరం కాగా.. అదనంగా 18 ఈవీఎంలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంల పనితీరును పరిశీలించేందుకు జూన్ మొదటి వారంలో ఈసీఎల్ కంపెనీకి చెందిన సాంకేతి నిపుణులు జిల్లాకు రానున్నారు. ఆ తర్వాత  ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే బ్యాలెట్ పత్రాలను ముద్రించేందుకు ఆర్డర్లు ఇవ్వనున్నారు.
 

మరిన్ని వార్తలు