వరంగల్‌ : మొదటిసారైనైతే నేమి... గెలుస్తాం

4 Dec, 2018 09:05 IST|Sakshi

తొలిసారిగా ఎన్నికల్లో పోటీ..ప్రధాన అభ్యర్థుల్లో కలవరం 

వివిధ రంగాల నుంచి బరిలోకి హేమాహేమీలకు దీటుగా ప్రచారం 

రాజకీయాల్లో రాణించాలంటే అనుభవంతో పాటు వ్యూహ రచన, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరిచయాలు, జనాల్లో పలుకుబడి ఉండాలి. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం అలాంటి సంప్రదాయం నెమ్మదిగా రూపుమారుతోంది. ఇప్పటి వరకు జనాలకు అంతగా పరిచయం లేని వారు తెరపైకి వచ్చి హేమాహేమీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్నవారిలా ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. వారు వన్‌సైడే అనుకున్న చోట ఉత్కంఠ ఫలితాలకు తెరతీస్తున్నారు.  

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయని వారు రాష్ట్ర అసెంబ్లీ–2018 ఎన్నికల బరిలో నిలిచారు. కొందరు కొత్తగా రాజకీయాల్లోకి వస్తే మరికొందరు రాజకీయాల్లో ఉంటు పోటీ చేయడం ఇదే తొలిసారి. వారసత్వం,  వ్యాపార రంగాల నుంచి రాజకీయాల్లో వచ్చి ప్రచార జోరు పెంచుతున్నారు. దీంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులగా బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

సీనియర్ల సలహాలు.. 
రాజకీయ ఉద్ధండులకు తీసిపోకుండా వ్యూహాలు పన్ని ప్రచారంలో దూసుకెళ్తూ వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. పార్టీ సీనియర్లను గౌరదవిస్తూనే వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడ అసంతృప్తి సెగ రాజుకోకుండా తమదైన శైలిలో ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 172 మంది బరిలో ఉండగా కొందరికీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. కాగా ఎలాంటి బెణుకు లేకుండా ప్రాంతాన్ని బట్టి అక్కడి సమస్యలను కళ్లకు కట్టే విధంగా వివరించడంతో పాటు వాటి పరిష్కార మార్గాలను పూసగుచ్చినట్లు తెలుపుతున్నారు. వారిలో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన వారి వవరాలు ఇలా ఉన్నాయి.  

స్టేషన్‌ఘన్‌పూర్‌లో  ఇందిర.. 
సింగపురం ఇందిర తండ్రి దేవదానం కాంగ్రెస్‌ పార్టీ అభిమాని. వరంగల్‌కు ఇందిరాగాంధీ వచ్చిన సమయంలో ఇందిర పుట్టంది. దీంతో ఇందిరమ్మ పేరును తన బిడ్డకు నామకరణం చేశాడు దేవదానం. ఇందిర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పదవులను నిర్వర్తిస్తున్నారు. కాగా ప్రస్తుతం పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు గట్టి పోటీ ఇస్తున్నారు. 

డోర్నకల్‌లో లక్ష్మణ్‌ నాయక్‌.. 
డోర్నకల్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా లక్ష్మణ్‌ నాయక్‌ పోటీ చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలంటే మక్కువతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు.  బీజేపీలో వివిధ పదవులు చేపట్టారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురానికి చెందిన లక్ష్మణ్‌ నాయక్‌కు బీజేపీ డోర్నకల్‌లో ఆవకాశం ఇవ్వడంతో  తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుం టున్నారు.

వారసత్వంగా కీర్తిరెడ్డి 
మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు డాక్టర్‌ కీర్తిరెడ్డి బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.  2009 నుంచి పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్‌ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గండ్ర సత్యనారాయణ బరిలో ఉన్నారు.  కీర్తిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త అయినప్పటికీ ప్రచారంలో తన పోటీదారులతో సమానంగా రాణిస్తున్నారు. ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలను కడిగిపారేస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా మాట్లాడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటోంది. 

మానుకోటలో హుస్సేన్‌ నాయక్‌.. 
మహబూబాబాద్‌ నియోజవర్గం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త హుస్సేన్‌ నాయక్‌ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. తొలుత కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన  ఆయన బీజేపీ టికెట్‌ను దక్కించుకున్నారు. కొంత కాలంగా మహబూ బాబాద్‌ ప్రజలతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా మానుకోటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ శంకర్‌ నాయక్, కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ బరిలో ఉన్నారు. హుస్సేన్‌ నాయక్‌ తనను గెలిపించాలని .. మానుకోటను అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను వేడుకుంటున్నారు. 

వ్యాపార రంగం నుంచి వద్దిరాజు రవిచంద్ర 
వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర బరిలో ఉన్నారు. గ్రానైట్‌ వ్యాపారంలో ఒదిగిపోయారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నాయకులతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. కాగా తూర్పులో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు గట్టి పోటీదారుడిగా రవిచంద్ర ప్రచారం కొనసాగిస్తున్నారు. ముందుగా ఒకింత తడబడిన ప్రస్తుతం తన వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.  కూటమి అధికారంలోకి వస్తే అమలు చేస్తే పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు