నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ 

8 Jun, 2019 02:32 IST|Sakshi
చేప ప్రసాదం కోసం వేచి చూస్తున్న ప్రజలు

సాయంత్రం 6 గంటలకు మృగశిర కార్తె ప్రవేశంతో పంపిణీ ప్రారంభం

1.65 లక్షల కొర్రమీను చేపలను సిద్ధం చేసిన మత్స్యశాఖ

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 40 కౌంటర్లు ఏర్పాటు

లక్ష మందికిపైగా ఆస్తమా రోగులు రావొచ్చని అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఏటా మృగశిర కార్తె సందర్భంగా అందజేసే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని నాంపలి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించనుంది. ఇందుకోసం 1.65 లక్షల కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ అందుబాటులో ఉంచింది. ఆదివారం సాయంత్రం వరకు బత్తిని సోదరులు, వారి కుటుంబ సభ్యులు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆ తరువాత 10, 11 తేదీల్లో వారి ఇళ్ల వద్ద చేప ప్రసాదంపంపిణీ చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి భారీగా ఆస్తమా బాధితులు తరలి రానున్నారు. గతేడాది సుమారు 70 వేల మందికి పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష వరకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా 40 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సుమారు 1,500 మందితో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా, నిరంతర విద్యుత్, తాగునీరు సదుపాయం కల్పించనుంది. చేప ప్రసాదం కోసం టోకెన్లు పంపిణీ చేయనున్నారు. జీహెచ్‌ంసీ ఆధ్వర్యంలో 100 మొబైల్‌ టాయిలెట్లను, 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, 6 వైద్య బృందాలు, 3 మొబైల్‌ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. 

బత్తిని కుటుంబం ప్రత్యేక పూజలు... 
మృగశిర కార్తె ప్రవేశం రోజున వంశపారంపర్యంగా తమ కుటుంబ సభ్యులు ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బత్తిని హరినాథ్‌గౌడ్, బత్తిని శంకర్‌గౌడ్‌లు తెలిపారు. హైదరాబాద్‌ దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలో శుక్రవారం ఉదయం సత్యనారాయణస్వామి పూజ నిర్వహించి చేప మందు పంపిణీకి ఏర్పాట్లను చేపట్టారు. చేప మందు పంపిణీ కార్యక్రమంలో బత్తిని హరినాథ్‌ గౌడ్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. 171 ఏళ్లుగా బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన మూడో తరం పంపిణీ చేస్తోంది. ఇతర వివరాల కోసం 9391040946, 8341824211, 9989989954 నంబర్లలో సంప్రదించవచ్చు. 

మరిన్ని వార్తలు