పాలేరు నీట..బతుకు ‘వేట’

27 May, 2014 02:09 IST|Sakshi

కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరు రిజర్వాయర్‌లో సోమవారం నుంచి జలపుష్పాలవేట ప్రారంభమైంది. వేకువజామునే వందలాది మంది మత్స్యకారులు జలాశయంలోకి దిగారు. చేపలు, రొయ్యల వేట సాగించారు. తొలిరోజు వేట సందర్భంగా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. పాలేరులో చేపలవేట ప్రారంభమైందని తెలుసుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం, పాలేరు, ఎర్రగడ్డ, కొత్తూరు, నర్సింహులగూడెం, కిష్టాపురం తదితర గ్రామాలకు చెందిన మత్స్యకారులతో పాటు రిజర్వాయర్ పరిసర ప్రాంతమైన నల్లగొండ జిల్లా మోతె మండలంలోని నర్సింహాపురం, అన్నారుగూడెం, ఉర్లుగొండ, నేరడవాయి, నాగాయిగూడెం, తుమ్మగూడెం గ్రామాలకు చెందిన వందలాది మంది  మత్స్యకారులు వేటలో పాల్గొన్నారు. వలలకు చిక్కిన చేపలను వీరు ఒడ్డుకు తీసుకొచ్చారు. వీరి కుటుంబసభ్యులు చేపలను కాంట్రాక్టర్ వద్దకు తీసుకెళ్లి విక్రయించారు.

 ఒప్పందం ప్రకారం కిలో చేపలను రూ.30 చొప్పున కాంట్రాక్టర్‌కు అమ్మారు. బయటివారికి మాత్రం కిలో రూ. 50 చొప్పున విక్రయించారు. రొయ్యలు ఏ గ్రేడ్ కిలో రూ.250, బీ గ్రేడ్ 100 చొప్పున కాంట్రాక్టర్‌కు అమ్మారు.  

 కాంట్రాక్టర్‌కు దక్కని చేప...
 పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యకారులు పట్టే చేపలను ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు విక్రయించాలి. ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఏడాది మాత్రం ఎక్కువ మొత్తం చేపలను కాంట్రాక్టర్‌కు కాకుండా బయటివారికి అమ్మారు. మొత్తం 50 టన్నుల చేపలు దొరకగా కాంట్రాక్టర్‌కు కేవలం 15 టన్నులను మాత్రమే విక్రయించారు. 30 టన్నులకు పైగా చేపలను మత్స్యకారులు బయటి వ్యక్తులకు విక్రయించారని, తమకు నష్టం మిగిల్చారని కాంట్రాక్టర్ విలేకరుల ఎదుట వాపోయాడు.

 తొలిరోజు జోరు..
 రిజర్వాయర్‌లో తొలిరోజు వేట ఆశాజనకంగా సాగింది. సుమారు 50 టన్నుల చేపలు, పది టన్నుల వరకు రొయ్యలు మత్స్యకారుల వలలకు చిక్కాయి. రవ్వ, బొచ్చె చేపలు ఎక్కువగా దొరికాయి. రొయ్యలను ఎప్పటి కాంట్రాక్టరే కొనుగోలు చేయగా,  చేపలను మాత్రం హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ కొనుగోలు చేశాడు. గతేడాది కంటే ఈ ఏడాది చేపల పరిమాణం భారీగా పెరిగింది. ఒక్కో చేప సుమారు ఐదు కిలోల వరకు తూగింది. తొలిరోజు ఒక్కో మత్స్యకారుడు చేపలు, రొయ్యల వేట ద్వారా సగటున రూ.5 వేల వరకు ఆదాయాన్ని పొందాడు. గత సంవత్సరం తొలిరోజే మత్స్యకారులు వంద టన్నులకు పైగా చేపలు పట్టడంతో ఒక్కరోజుతోనే రిజర్వాయర్‌లో అడుగంటిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు