చేపా.. చేపా ఎందుకురాలేదు?

3 Oct, 2019 02:57 IST|Sakshi

కానరాని ఉచిత చేప పిల్లల పంపిణీ

సర్కారు ఆదేశాలు పట్టించుకోని మత్స్యశాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జలకళ ఉట్టిపడుతోంది. జలాశయాలు, చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నా యి. ఇటువంటి పరిస్థితుల్లో చేప పిల్లలను జలాశయాల్లోకి విడుదల చేయడంలో మత్స్యశాఖ విఫలమైందన్న ఆరోపణలున్నాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారంటే నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. నీరు సమృద్ధిగా ఉన్న జలాశయా ల్లోనూ కేవలం లక్ష్యంలో 59.38 శాతం మాత్రమే చేప పిల్లలను వదలడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది 22,203 జలాశయాల్లో 82.28 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. 12,778 జలాశయాల్లోకి మాత్రమే నీరు వచ్చిందని, అందులో 55.60 లక్షల చేప పిల్లలు అవసరమని నిర్ధారించారు. ఆ ప్రకారం చూసినా ఇప్పటివరకు కేవలం 9,283 జలాశయాల్లో 33.02 కోట్ల చేప పిల్లలను మాత్రమే విడుదల చేసినట్లు మత్స్యశాఖ నివేదిక వెల్లడించింది. అంటే కేవలం 59.38 శాతం మాత్రమే విడుదల చేశారు.  

సూర్యాపేటలో 11.44 శాతమే.. 
ప్రభుత్వం మూడేళ్లుగా మత్స్యకార సొసైటీల ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని మొదలుపెట్టింది. 2016–17లో 27.85 కోట్ల చేప పిల్లలను, 2017–18లో 51 కోట్లు, 2018–19లో 49.15 కోట్ల చేప పిల్లలను వదిలిపెట్టింది. ఈసారి భారీ వర్షాలు కురిసినా లక్ష్యాన్ని చేరుకోవ డంలో అధికారులు తంటాలు పడుతున్నా రు. సూర్యాపేట జిల్లాలో 3.14 కోట్ల చేపపిల్లలను వదలాలని నిర్ణయించ గా, 36 లక్షల చేప పిల్లలను విడుదల చేయడంపై విమర్శలొచ్చాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 94.49 శాతం, ఖమ్మం జిల్లాలో 94.07%, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 93.66 శాతం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 89.14 శాతం, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 88.99 శాతం చేప పిల్లలను వదిలారు. చాలా జలాశయాల్లో వరదల కారణంగా నీరు బయటకు పోవడంతో అప్పటికే వేసిన చేప పిల్లలు కూడా వెళ్లిపోయాయని సొసైటీల ప్రతినిధులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు