లక్ష్యం చేరలే..

22 Dec, 2018 12:02 IST|Sakshi

మత్స్య పథకం అమలులో తీవ్ర జాప్యం

హన్మకొండ చౌరస్తా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమీకృత మత్స్య అభివృద్ధి పథకం లక్ష్యం నెరవేరడం లేదు. చేపల పెంపకం.. చేప విత్తనాల ఉత్పత్తి.. ప్రాసెసింగ్‌.. మార్కెటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి చేయూతనందించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం నిధుల లేమితో పేదల దరిచేరని పరిస్థితి నెలకొంది. సుమారు రూ.వెయ్యి కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఎఫ్‌డీఎస్‌ అమలుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మంది మత్స్యకారులు ఉండగా.. ఇందులో 40 శాతం మంది మాత్రమే లబ్ధి పొందినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన 60 శాతం మంది డీడీలు చెల్లించి.. ఆరు నెలలకు పైగా వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. 

నిధుల కొరతే కారణమా..
పథకం అమలులో జాప్యంపై అధికారులను సంప్రదించగా.. ఎన్నికలే కారణమని చెప్పారు. కోడ్‌ అమలులో ఉన్నందున వాహనాలను పంపిణీ చేయలేదని అంటున్నారు. అయితే.. ఎన్నికల ముందే ప్రారంభమైన పథకానికి కోడ్‌ సంబంధమేంటని మత్స్య సహకార సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా నిధుల కొరత కారణంగానే పథకం అమలు నిలిచిపోయినట్లు సమాచారం. 

వస్తాయా.. లేదా.. 
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా లబ్ధిపొందే వస్తువుపై లబ్ధిదారుడు 25 శాతం మొత్తాన్ని డీడీ ద్వారా మత్స్యశాఖ కార్యాలయం పేరుతో చెల్లించాలి. మిగిలిన 75శాతం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రాతిపదికన టీవీఎస్‌ మోపెడ్, లగేజీ ఆటోల కోసం చెల్లించిన వారే ఎక్కువ శాతం  మంది ఉన్నారు. ఇందులో 40 శాతం మంది లబ్ధిదారులకు మాత్రమే వాహనాలు అందినట్లు మత్స్య సహకార సంఘాలు చెబుతున్నాయి. టీవీఎస్‌ మోపెడ్‌ నుంచి లగేజీ ఆటోల వరకు లబ్ధిదారులుగా ఎంపికైన మత్స్యకారులు డీడీలు చెల్లించి ఆరు నెలలు గడుస్తోంది. అప్పు తెచ్చి డీడీలు చెల్లించిన మత్స్యకారులకు నిధుల లేమి నేపథ్యంలో వాహనాలు వస్తాయా.. లేదా.. అనే అనుమానం వారిని పీడిస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు