పాలేరు జలాశ్రయం

12 May, 2014 01:29 IST|Sakshi

కూసుమంచి, న్యూస్‌లైన్: విశాలమైన పాలేరు రిజర్వాయర్. దీన్ని నమ్ముకొని వందలాదిమంది మత్స్యకారులు. ఎన్నో ఏళ్లుగా చేపలు, రొయ్యల వేటే జీవనాధారంగా బతుకు సాగిస్తున్నారు. వేట మొదలైందంటే మత్స్యకారుల ఇళ్లలో సందడే సందడి. నాలుగురాళ్లు వెనుకేసుకోవచ్చన్న ఆనందం. గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపే చేపలవేట ఈనెల 25వ తేదీ నుంచి మొదలవబోతుంది. ఆ రోజుకోసం ఇప్పటి నుంచే మత్స్యకారులతో పాటు చేపలకూర ప్రియులు ఎందరో ఎదురుచూస్తున్నారు.

 ఏడాది జీవనానికి ఆ రెండు నెలలే ఆధారం...
 పాలేరులో వేట మొదలైందంటే తెలవారుతుండగానే మత్స్యకారులు  రిజర్వాయర్‌లోకి దిగుతుంటారు. తెప్పలెక్కి.. వలలు విసురుతూ రాత్రి వరకు వేట కొనసాగిస్తారు. ఇలా కష్టపడితే వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో పాలేరు రిజర్వాయర్‌లో చేపలు, రొయ్యల వేట మొదలవుతుంది. ఈవేట సుమారు రెండునెలల వరకు కొనసాగుతుంది. ఈ రెండునెలల్లో సంపాదించిన దానితోనే మత్స్యకారులు ఏడాదంతా బతకాలి. కాబట్టి ఇంటిల్లిపాది ఈ వేటలో పాల్గొంటారు. మత్స్యకారుల్లో ఎక్కువమంది వేరే ఉపాధి లేక మిగతా సమయాల్లో ఇళ్లవద్దనే ఉంటారు. చేపలు, రొయ్యల వేటకు అవసరమైన వలలు, తెప్పలు, బుట్టల వంటివి తయారు చేస్తుంటారు.

 ఎందరికో బతుకునిస్తూ...
 వందలాదిమందికి జీవనోపాధి కల్పిస్తోంది పాలేరు రిజర్వాయర్. కూసుమంచి మండలంలోని పాలేరు, నాయకన్‌గూడెం, కిష్టాపురం, కొత్తూరు, ఎర్రగడ్డ, నర్సింహులగూడెం, భగవత్‌వీడు గ్రామాలతో పాటు సమీప నల్లగొండ జిల్లాలోని మోతె మండలం తుమ్మగూడెం, నాగాయిగూడెం, ఉర్లుగొండ, నర్సింహాపురం, అన్నారుగూడెం, నేరడవాయి, బొడబండ్లగూడెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 1500 నుంచి రెండువేల మంది మత్స్యకారులు రిజర్వాయర్లో చేపలు, రొయ్యల వేట చేసి జీవనోపాధి పొందుతున్నారు.

 వెన్నంటే కష్టాలు, బాధలు...
 వేటసాగినన్ని రోజులూ సుఖసంతోషాలతో వర్ధిల్లే మత్స్యకారుల జీవితాల్లో ఆ తర్వాత అంతా చీకటే. రెండు నెలల ఆదాయంతోనే ఏడాది పాటు బతుకుబండి లాగించాల్సిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి. గిట్టుబాటు కాకపోయినా సరుకు నిల్వ ఉంచుకునేది కాదు కాబట్టి ఒక్కోసారి అతి తక్కువ ధరలకు చేపలు అమ్మాల్సి వస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. కిలో చేపలకు కాంట్రాక్టర్ రూ.25 నుంచి 35, కిలో రొయ్యలకు రూ.150 నుంచి 200 వరకు మాత్రమే చెల్లిస్తారని చెబుతున్నారు. చేపల వేట కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పడితే ఒక్కోసారి క్వింటాళ్ల కొద్దీ చేపలు పట్టవచ్చని, లేదంటే ఒకటి, రెండు కిలోలు కూడా దొరకటం కష్టమని వాపోతున్నారు. ఇంతా చేస్తే ఒక్కోసారి కాంట్రాక్టర్లు ధర విషయంలో పేచీలు పెడుతుంటారని చెబుతున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు కావడంతో వారు చెప్పిందే వేదం.

 మండుతున్న వేట సామగ్రి ధరలు
 మత్స్యవేటకు అవసరమైన సామగ్రిని వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. వలలు, బుట్టలు, తెప్పల వంటివి కొనుగోలు చేయడం గంగపుత్రులకు తలకు మించిన భారం అవుతోంది. ప్రభుత్వం (మత్స్యశాఖ) రిజర్వాయర్‌లో చేప పిల్లలను మాత్రమే వదులుతుంది. కనీసం చేపలకు మార్కెటింగ్ సౌకర్యం, మత్స్యకారులకు వలలు, చేపల వంటివి ఏవీ సబ్సిడీపై అందించదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయూత లేకపోవడంతో గత్యంతరం లేక మత్స్యకారులు కాంట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా కాంట్రాక్టర్లు మత్స్యకారులను నిలువునా ముంచుతున్నారు.

 రెండేళ్ల క్రితం కోల్‌కతకు చెందిన ఓ కాంట్రాక్టర్ చేపలను కొనుగోలు చేసి మత్స్యకారులకు రూ.40లక్షలు ఎగనామం పెట్టాడు.

 ఈ యేడాది చేపల వేట ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మత్స్యకారులు తెలిపారు. వేటకు అవసరమైన వలలు, బుట్టల వంటివి సమకూర్చుకునే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు