వ్యర్థ జలాలతో మృత్యువాత పడుతున్న చేపలు

8 Aug, 2019 10:03 IST|Sakshi
మృతి చెందిన చేపలను పరిశీలిస్తున్న పీసీబీ అధికారులు (ఫైల్‌)

వ్యర్థాలను బహిరంగంగా వదులుతున్న యాజమాన్యాలు

నమూనాలను సేకరించి చేతులు దులుపుకుంటున్న పీసీబీ అధికారులు 

సాక్షి, పటాన్‌చెరు: వర్షాకాలం మొదలైంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల యాజమన్యాలు యద్దేచ్ఛగా కాలుష్య జలాలను వర్షపు నీటితో కలిపి బయటకు వదులుతున్నాయి. దీంతో సమీపంలోని చెరువులు , కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. చేపలు పెంచి వాటిని విక్రయిచి జీవనాన్ని సాగిస్తున్న మత్య్సకారులకు మాత్రం కాలుష్య జలాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కాలుష్య జలాల ప్రభావంతో చెరువుల్లోని చేపలు మృత్యువాత పడుతు¯న్నాయి. ప్రతి ఏటా ఇదే విధంగా జరుగుతున్నా యాజమాన్యాలు మాత్రం మారడం లేదు.

పీసీబీ అధికారులకు మాత్రం ఎప్పటిలాగే చెరువుల్లోని చేపలు మృతి చెందటంతో పరిశీలనలు చేసి, కాలుష్య జలాల నమూనాలను సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడలతో పాటు గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడల్లో సుమారు 150రసాయన పరిశ్రమలు ఉన్నాయి. పారిశ్రామిక వాడలకు ఆనుకోని  చెరువులు, కుంటలు ఉన్నాయి. గడ్డపోతారంలోని అయ్యమ్మ చెరువులో ప్రతి ఏటా మత్య్సకారులు చేప పిల్లను వేసి వాటిని పెంచి  విక్రయించి ఉపాధిని పొందుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సుమారు రూ. 5లక్షల విలువైన చేప పిల్లలను మత్య్సకారులు చెరువులో వదిలారు.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షం నీటితో కలిసి చెరువు పైబాగంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థ జలాలు స్థానికంగా ఉన్న అయ్యమ్మచెరువులో కలిశాయి. దీంతో చెరువులో ఉన్న నాలుగు లక్షల చేపపిల్లలు మృతి చెందాయి. మత్య్సకారులు హుటాహుటీన పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఎప్పలాగే పీసీబీ అధికారులు ఆయా పరిశ్రమల్లో పర్యటించి నమూనాలను సేకరించి, మృతి చెందిన చేపలను పరిశీలించారు.  ఏళ్ల కాలం నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. కాలుష్య జలాల కారణంగా చెరువులోని చేపలు మృతి చెందినా తగిన నష్టపరిహారాన్ని అందించేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావటం లేదు.  

నామమాత్రంగా అధికారుల చర్యలు..
వర్షాకాలంలో కాలుష్య జలాలను నియంత్రించటంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు బయటకు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదు. పరిశ్రమలతో ïపీసీబీ అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో కాలుష్య జలాల ప్రవాహం వల్ల చెరువుల్లోని చేపలు మృత్యువాత పడ్డ సంఘటనలు చాలా జరిగాయి. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 


గడ్డపోతారం చెరువులోకి వస్తున్న కాలుష్య జలాలు  

మరిన్ని వార్తలు