ఫిట్‌ ఫంక్షన్‌

23 Sep, 2019 09:38 IST|Sakshi

మారుతున్న వ్యాయామ శైలి

రోజువారీ పనుల కోసం ఫిట్‌నెస్‌

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు

సిటీ ‘రిమ్‌ జిమ్‌ రిమ్‌ జిమ్‌ హైదరాబాద్‌’ అనిపాడేస్తోంది. పెరుగుతున్న ఫిట్‌నెస్‌ క్రేజ్‌కి తగ్గట్టుగా వందల సంఖ్యలో వెలుస్తున్న ఫిట్‌నెస్‌ స్టూడియోలు జిమ్‌ కల్చర్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. దీనిలో భాగంగానే నగరవాసులను ఉర్రూతలూగిస్తోంది‘ఫంక్షనల్‌ ట్రైనింగ్‌’.

సాక్షి,సిటీబ్యూరో: జిమ్‌ అంటే ట్రెడ్‌ మిల్, క్రాస్‌ ట్రైనర్‌ వంటివాటితో చేసే కార్డియో వాస్క్యులర్‌ వ్యాయామాలు, వెయిట్స్‌తో చేసే స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వర్కవుట్స్‌ వంటివే ఉంటాయి. దీనికోసం ఎన్ని మెషిన్లు ఉంటే అంత గొప్ప జిమ్‌గా చెబుతుంటారు. కానీ గత నాలుగైదేళ్లుగా పెరిగిన ఆరోగ్య స్పృహ, మారుతున్న సిటీజనుల ఆసక్తులు వీటికి తోడు అందుబాటులోకి వచ్చిన అంతర్జాతీయ శైలి వర్కవుట్స్‌ సిటీలో వ్యాయామ సరళి రోజు రోజుకూ మారిపోతోంది. జిమ్స్‌లో కొత్త కొత్త వర్కవుట్స్‌ పరిచయం చేయడానికి తోడు ప్రత్యేకమైన వ్యాయామ శైలుల కోసమే ఫిట్‌నెస్‌ స్టూడియోలు ఏర్పాటవుతున్నాయి. అలాంటి కోవలోనే ఇప్పుడు ‘ఫంక్షనల్‌ ట్రైనింగ్‌’ వచ్చి చేరింది. 

రొటీన్‌ వర్క్‌.. నాట్‌ అవుట్‌
తమ రోజువారీ పనులను మరింత శక్తివంతంగా, సామర్థ్యంతో చేయాలని, అలసట రాకూడదని సిటీజనులు కోరుకుంటున్నారు. ఇదే ఫంక్షనల్‌ ట్రైనింగ్‌కి ఊపునిస్తోంది. దీనికోసం డిజైన్‌ చేసిన వ్యాయామాలు మన రోజువారీ కార్యకలాపాలు మరింత సులభతరం చేసేలా ఉంటాయి. యాక్టివిటీ బియాండ్‌ వర్కవుట్‌ అంటే వర్కవుట్‌కి అవతల చేసే యాక్టివిటీ అని ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ని నిర్వచించవచ్చు. బైసప్‌ వర్కవుట్‌ అంటే నడుము దగ్గర్నుంచి చేతులతో బరువులు ఎత్తుతాం. అయితే రోజువారీ పనుల్లో అది మనకు ఏ రకంగానూ ఉపకరించదు. అదే నేల మీద పడి ఉన్నవి తీయడం, వంగుని షూ లేస్‌ కట్టడం, ఒక డోర్‌ని బలంగా తోసి ఓపెన్‌ చేయడం.. ఇవన్నీ మనకు రోజువారీ పనుల్లో భాగంగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ శిక్షణ డిజైన్‌ చేశారు. ఈ సాధనలో బరువులు ఎత్తడం మీద తక్కువ.. కదలికలపై ఎక్కువగా దృష్టి పెడతారు. దీనిలో భాగంగా మనం రోజూ చేసే వాకింగ్‌ లాంటివి కూడా మరింత వేగంగా విభిన్నంగా చేయిస్తారు. కాస్త బరువైన వస్తువును లేపుతూ స్క్వాటింగ్‌ చేయడం, ఒక కుర్చీలోకి ఎక్కి దిగడం, ఒక డోర్‌ను బలంగా తోయడం సైతం ఇందులో సాధన చేయిస్తారు.

ఖర్చు లెస్‌..
లాభం ప్లస్‌ ఒక క్రీడకు సన్నద్ధం అవడంఎలాగుంటుందో అలాంటి వ్యాయామాలు ఈఫంక్షనల్‌ ట్రైనింగ్‌లో ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఈ శిక్షణ ఇచ్చే ఫిట్‌నెస్‌ స్టూడియోలకు వ్యయం కూడా తక్కువగా ఉంటోంది. దీంతో సభ్యత్వ రుసుం కూడా తక్కువగానే వసూలు చేస్తున్నారు. సిటీలో ఎఫ్‌ 45, ఫిట్టింగ్‌ రూమ్‌ (హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌),కల్ట్‌ వంటి ఫిట్‌నెస్‌ సెంటర్స్‌ ఫంక్షనల్‌ ట్రైనింగ్‌కి చిరునామాగా పేరొందాయి.  

మల్టీ బెని‘ఫిట్స్‌’  
ఈ ఫంక్షనల్‌ వర్కవుట్‌లో స్క్వాట్స్, లంజెస్, డెడ్‌ లిఫ్టŠస్‌ పుషప్స్, ప్లంక్స్‌.. వంటివి కలగలసి ఉంటాయి. మల్టీ జాయింట్స్‌ కదిలేలా అత్యధిక ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ కదలికలు ఉంటాయి. శరీరం ముందుకీ, వెనక్కీ ఇరు పక్కలకీ కిందకీ పైకీ.. ఇలా విభిన్న రకాల కదలికలు మరింత వేగంగా సులువుగా చేయగలిగేలా ఈ శిక్షణ ఉంటుంది. ఫ్రీ వెయిట్స్‌తో పాటు కొన్ని ప్రత్యేకమైన పరికరాలు వినియోగిస్తారు తప్ప ఎటువంటి మెషీన్లూ ఉండవు. ‘మెషీన్ల ద్వారా చేసే వ్యాయామాల్లో ఒక రిథమ్‌ ఉంటుంది. అవి ఒకటి రెండు ప్రత్యేక శరీర భాగాలను మాత్రమే కదలిస్తాయి. ఉదాహరణకు లెగ్‌ ఎక్సటెన్షన్‌ మెషిన్‌ని తీసుకుంటే అది తొడలోని ముందు కండరాలను మాత్రమే కదుపుతుంది. నిజానికి దాన్ని మనం రోజువారీ పనుల్లో ఎక్కువగా వినియోగించం. కోర్‌ మజిల్స్‌ని బాగా వినియోగిస్తాం. కానీ ఈ మెషీన్ల ద్వారా కోర్‌ మజిల్‌కి వర్కవుట్‌ అందదు’ అని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ గంధం విజయ్‌ చెప్పారు.  

వ్యాయామం..
జర భద్రం సాక్షి, సిటీబ్యూరో: భుజాలు జారిపోవడం, మోకాళ్లు అరిగిపోవడం, వెన్నుపూస వంగిపోవడం.. వంటి కీళ్ల సమస్యలు ఇప్పుడు నగర వాసుల్లో సాధారణంగా మారిపోయాయంటున్నారు జూబ్లీహిల్స్‌లోని రీజెన్‌ ఆర్థో స్పోర్ట్స్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మొవ్వా వెంకటేష్‌. ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న సమస్యలు, తాజాగా అందుబాటులోకి వచ్చిన స్టెంసెల్‌ చికిత్స గురించి ఆయన చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే..

స్లో వర్క్‌.. స్పీడ్‌ వర్కవుట్‌
కీళ్ల సమస్యలు బాగా శారీరక శ్రమకు గురయ్యే వారికి.. ముఖ్యంగా క్రీడాకారులకే వచ్చేవి. అందుకే ‘స్పోర్ట్స్‌ ఆర్థో’ పేరుతో ప్రత్యేక వైద్యసేవలూ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు క్రీడాకారుల తరహాలోనే నగరంలో ప్రతి ఒక్కరిలోనూ ఆర్థో సమస్యలు సాధారణమయ్యాయి. ఏసీ గదుల్లో దీర్ఘకాలం కూర్చోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలితో ఆస్టియో ఆర్థరైటిస్‌ విజృంభించింది. ఇప్పుడు పెరిగిన ఆరోగ్య స్పృహ సమస్యలకు కారణమవుతోంది. జిమ్‌లో ట్రైనర్‌ చెప్పాడని ఎలా పడితే అలా వ్యాయామాలు చేయడంతో సంసిద్ధంగా లేని శరీరం ఎదురు తిరుగుతోంది. భుజాలు పట్టు తప్పడం, వెన్నుపూస డిస్క్‌ అరిగిపోవడం, కీలు అరిగిపోవడం వంటివి వస్తున్నాయి. నివారణకు శరీర పనితీరుతో పాటు చికిత్సలపైనా అవగాహన అవసరం.

29న హాఫ్‌ మారథాన్‌  
హృద్రోగ సంబంధ వ్యాధులపై నగరవాసుల్లో అవగాహన పెంచేందుకు ఓ ఆంగ్ల దినపత్రిక ఆధ్వర్యంలో ‘హాఫ్‌ మారథాన్‌’ తలపెట్టారు. ఈ నెల 29న సంజీవయ్య పార్కులో ఇది జరుగనుంది. తెల్లవారుజామున 4 నుంచి 10 గంటల వరకూ 3 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ, 21 కి.మీ విభాగాల్లో రన్‌ ఉంటుంది.  

28న హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ రిట్రీట్‌
నగరానికి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దినాజ్‌ వర్వత్‌వాలా ఆధ్వర్యంలో హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ రిట్రీట్‌ బై దినాజ్‌ ఫిట్‌నెస్‌ పేరిట ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. నగరంలోని ట్రాన్స్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది.  

రేపు బూట్‌ క్యాంప్‌
నగరంలోని 360 డిగ్రీ జిమ్‌ ఆధ్వర్యంలో బూట్‌ క్యాంప్‌ ఫిట్‌నెస్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఫ్యాట్‌ లాస్‌కి, మెటబాలిజం పెంచడానికి, సామర్థ్యం సానబెట్టడానికి ప్రత్యేక వ్యాయామ శైలులు సాధన చేయించే ఈ క్యాంప్‌ను ఈ నెలాఖరు వరకూ సోమ, బుధ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు.  

‘స్టెమ్‌సెల్‌’థెరపీఉత్తమం
గతంలో కీళ్ల సమస్య అంటే ప్రాధమిక స్థాయిలో నొప్పి నివారణ మందులు, ముదిరిన తర్వాత సర్జరీ ఏకైక పరిష్కారం. ఇప్పుడు స్టెమ్‌సెల్‌ (మూల కణాల) థెరపీ రాకతో సర్జరీ అవసరం తప్పుతోంది. గాయాలను శరీరంలో సహజంగానే ఉత్పత్తి అయ్యే స్టెమ్‌సెల్‌ మాన్పుతుంది. ఈ థెరపీలో తొలుత శరీరంలోని ఏదేని భాగం నుంచి మూల కణాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించాక రోగి శరీరంలో గాయపడిన/లేదా సమస్యకు గురైన ప్రాంతంలోకి ఎక్కిస్తారు. తద్వారా సహజంగానే సదరు కీళ్ల అరుగుదల తగ్గుతుంది. కీళ్ల సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా