ఇక షోరూమ్‌లోనే నంబర్‌ప్లేట్‌..!

21 Dec, 2019 12:04 IST|Sakshi
నల్లగొండలోని ఓ షోరూమ్‌లో కొత్తబైక్‌కు నంబర్‌ ప్లేట్‌ బిగిస్తున్న సిబ్బంది

ఆర్‌టీఏ నుంచి షోరూమ్‌లకు బదలాయించిన కేంద్రం

వాహన విక్రయాల్లో కొత్త పద్ధతి

రిజిస్ట్రేషన్‌ అనంతరం షోరూమ్‌లోనే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ బిగింపు

వాహన ధరలోనే ప్లేట్‌ రుసుము

పెరిగిన వాహన రిజిస్ట్రేషన్లు

సాక్షి, నల్లగొండ: వాహనాలు కొనుగోలు చేసిన చోటే ఇకనుంచి నంబర్‌ ప్లేట్లను బిగించనున్నారు. గతంలో రిజిస్ట్రేషన్‌ చేసిన కార్యాలయంలోనే నంబర్‌ ప్లేట్లు వేయగా.. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను ఆర్‌టీఏ కార్యాలయం నుంచి వాహన షోరూమ్‌లకు బదలాయించింది. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో వాహనాలకు రిజిస్ట్రేషన్‌ జరిగితే నంబర్‌ ప్లేట్లు మాత్రం ఎక్కడైతే వాహనాన్ని కొనుగోలు చేస్తామో అక్కడే బిగించనున్నారు. 

గత ఇలా..
గతంలో కారు, బైక్, ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు తదితర వాహనాలను షోరూమ్‌లో కొనుగోలు చేసి.. షోరూమ్‌ పేపర్ల ద్వారా ఆర్‌టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు. అదే సందర్భంలో ఆర్‌టీఏ కార్యాలయం నుంచి ఆ వాహనానికి నంబర్‌ను సీరియల్‌ పద్ధతిలో అలాట్‌ చేసేవారు. ఫ్యాన్సీ నంబర్‌ కావాలంటే ఆ నంబర్‌ను బుక్‌ చేసుకోవడం, ఎక్కువ మంది అదే నంబర్‌ కోరుకుంటే డ్రా పద్ధతిన ఎక్కువ రుసుం చెల్లించి పొందాల్సి ఉండేది. రిజిస్ట్రేషన్‌ అయిన మూడు రోజుల తర్వాత అలాటైన నంబర్‌ను హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ను ఆర్‌టీఏకు అనుసంధానంలో ఉన్నటువంటి ఏజెన్సీల ద్వారా వాహనాలకు అమర్చేవారు. 

కొత్త విధానం ఇలా...
ప్రస్తుతం ఏ వాహనాన్ని కొనుగోలు చేసినా షోరూమ్‌లో వెంటనే కొనుగోలుదారుడి పేరును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. దాంతో మొదట టీఆర్‌ నంబర్‌ వస్తుంది. ఆ తర్వాత ఆర్‌టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించాలి. అప్పుడు ఆన్‌లైన్‌ ద్వారానే నంబర్‌ అలాట్‌ అయి సంబంధిత షోరూమ్‌కు వస్తుంది. ఒకవేళ ఫ్యాన్సీ నంబర్‌ కావాలంటే మాత్రం ఎక్కువ రుసుము చెల్లించాలి. అది హైదరాబాద్‌ నుంచే నేరుగా సీల్డ్‌ కవర్‌లో సంబంధిత షోరూమ్‌కు పంపిస్తారు. హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లన్నింటినీ సంబంధిత షోరూమ్‌లకు వస్తాయి. రిజిస్ట్రేషన్‌ అనంతరం వాహనదారులు షోరూమ్‌కు వెళ్తే నంబర్‌ ప్లేట్‌ను బిగిస్తారు. ఈ ప్రక్రియ గత నెల నుంచి జిల్లాలో అమలు అవుతోంది. 

వాహనం ధరలోనే ప్లేట్‌ రుసుము
వినియోగదారుడు ఏ వాహనాన్నైతే కొనుగోలు చేస్తాడో దానికి సంబంధించి నంబర్‌ ప్లేట్‌కు అయ్యే రుసుమును ముందే చెల్లించాల్సి ఉంటుంది. బైక్‌కు రూ.245, ఆటో రూ.282, కారు రూ.619, లారీ, బస్సు, ఇతర వాహనాలకు రూ.649 చొప్పున వాహన కొనుగోలు ధరలోనే కలిపి వసూలు చేస్తారు. 

రోజూ అధికంగా రిజిస్ట్రేషన్లు
గతంలో కొందరు వాహనాలు కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్‌ విషయంలో ఆలస్యం చేసేవారు. టీఆర్‌ నంబర్‌ మీదనే వాహనాన్ని నడిపేవారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచి్చన విధానంతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి్సందే. దీంతో జిల్లా వ్యాపంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పెద్దయెత్తున రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. జిల్లాలో రోజుకు 200 పైచిలుకు వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సంఖ్య కాస్త తక్కువగా ఉండేది. 

మరిన్ని వార్తలు