కొత్తగా ఐదు విమానాశ్రయాలు!

20 Jul, 2018 00:57 IST|Sakshi

వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం, జక్రాన్‌పల్లిలో అవకాశం

ఏర్పాటు అవకాశాలపై సర్వే నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశం

వరంగల్‌లో ఏర్పాటుపై 27న ఏవియేషన్‌ అధికారులతో సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విమానయాన సదుపాయం కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. వరంగల్‌ జిల్లా మామునూరు, ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని, ఇందుకు అవసరమైన సర్వేలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

వరంగల్‌ జిల్లా మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ దగ్గర సుమారు 750 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, దీనికి అదనంగా మరింత స్థలాన్ని సేకరించాల్సిన అవసరముందని అధికారులు మంత్రికి వివరించారు. అలాగే మిగిలిన నాలుగు చోట్లతో పోల్చితే వరంగల్‌లో ముందుగానే విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయని నివేదించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 27న వరంగల్‌లో సమీక్ష నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులను కూడా ఆహ్వానించాలని ఆదేశించారు.

కొత్తగూడెంలో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించినట్లు అక్కడి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తెలిపారు. తాజాగా గుర్తించిన స్థలం సర్వేకు సిద్ధంగా ఉందని కేటీఆర్‌కు చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాన్‌పల్లి వద్ద మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు హబ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎంపిక చేసిన ఈ ఐదు ప్రాంతాల్లో విమాన సౌకర్యం కల్పించేందుకు అవసరమైన నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తదితర సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. త్వరలోనే సర్వే ప్రక్రియను ప్రారంభించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు.
‘సీ ప్లేన్‌’ ఏర్పాటు కోసం

సాగునీటి అధికారులతో భేటీ
నూతనంగా దేశంలో అందుబాటులోకి వస్తున్న సీ ప్లేన్‌ సదుపాయానికి అనుకూలంగా ఉన్న రిజర్వాయర్లను గుర్తించేందుకు సాగు నీటి శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ను కేటీఆర్‌ ఆదేశించారు.

రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విహార, ఆధ్యాత్మిక కేంద్రాలను కొత్తగా వచ్చే ఐదు విమానాశ్రయాలు, సీ ప్లేన్, హెలీపోర్టులను అనుసంధానం చేసేందుకు రాష్ట్ర విమానయాన వ్యూహాన్ని తయారు చేయాలని రాష్ట్ర ఏవియేషన్‌ కార్పొరేషన్‌ అధికారులకు మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్‌ స్కీంలో ఉన్న సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ భరత్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు