నీట మునిగి ఐదుగురు మృతి

1 Jul, 2014 02:11 IST|Sakshi

* తాత కర్మకాండలకు వచ్చి కానరాని లోకాలకు
* నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో ఘటన
* మృతుల్లో అన్నాతమ్ముడు, అక్కాచెల్లెలు
 
డిండి : తాత దశదినకర్మలకు వచ్చిన మనవళ్లు, మనుమరాళ్లు ప్రమాదవశాత్తు నీటి మునిగి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో జరిగింది. అన్నా తమ్ముడు, అక్కా చెల్లెలు, మరో బంధువు కలసి మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. వివరాలలోకి వెళితే... డిండి మండలకేంద్రానికి చెందిన దోవతి మల్లారెడ్డికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమారుడు దత్తారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో గ్రామీణ వికాస్‌బ్యాంకులో క్యాషియర్ కాగా, రెండో కుమారుడు కరుణాకర్‌రెడ్డి డిండిలోనే టైలర్‌గా పనిచేస్తున్నాడు.  మూడో కుమారుడు సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఫైనాన్స్ కన్సల్టెంట్. పదిరోజుల క్రితం మల్లారెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందాడు.

డిండిలో ఆదివారం జరిగిన ఆయన దశదినకర్మలకు కుమారులు, కూతుళ్లతో పాటు వారి పిల్లలు, బంధువులు హాజరయ్యారు. వారంతా రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి(30), ప్రణీత్‌రెడ్డి(20), కరుణాకర్‌రెడ్డి కుమార్తెలు జ్యోత్స్న(20), దేవమణి(17),  సుధాకర్‌రెడ్డి కుమారుడు అరవింద్‌రెడ్డి, మల్లారెడ్డి బావమరిది నర్సిరెడ్డి (వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలంలోని వనపర్తి) కుమారుడు అవినాష్‌రెడ్డి(20), బంధువుల అమ్మాయి మొత్తం ఏడుగురు కలసి డిండి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో స్నానం చేసేందుకు వెళ్లారు. హర్షవర్దన్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, జ్యోత్స్న, దేవమణి నీటిలోకి వెళ్లగా అరవింద్‌రెడ్డిని కెమెరాతో ఫొటో తీయమన్నారు.

కొంచెం లోపలికి వెళ్లేసరికి నలుగురూ నీటిలో మునిగారు. వారిని రక్షించేందుకు వెళ్లిన అవినాష్‌రెడ్డి కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న అరవింద్‌రెడ్డి, బంధువుల అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెళ్లి విషయం కుటుంబసభ్యులకు తెలిపారు. స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు కూడా పెద్దఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. సంఘటన స్థలంలో మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. డిండి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొం డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మృతదేహాలను సందర్శించారు.

మూడు కుటుంబాల్లో గర్భశోకం..
దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ప్రణీత్‌రెడ్డి ఎమ్మెస్సీ ఎంట్రన్‌‌స రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. కరుణాకర్‌రెడ్డి పెద్దకూతురు జ్యోత్స్న హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. దేవమణి డిండిలోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బీటెక్ పూర్తిచేసిన అవినాష్‌రెడ్డి నర్సిరెడ్డి ఒక్కగానొక్క కుమారుడు. నీటమునిగి ఈ మూడు కుటుంబాలకు చెందిన ఐదుగురు పిల్లలు మృత్యువాత పడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు.
 
ఘటనపై తక్షణం స్పందించిన కేసీఆర్
హైదరాబాద్: నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెంటనే స్పందించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి గాలింపుచర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అయితే, నాయిని డిండి వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే మృతదేహాలను వెలికితీశారనే సమాచారం అందడంతో కేసీఆర్ ఆయన్ను వెనక్కి రప్పించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు