ఒకేరోజు ఐదు మరణాలు

22 May, 2020 04:24 IST|Sakshi

రాష్ట్రంలో 45కి చేరిన కరోనా మృతుల సంఖ్య

కొత్తగా 38 మందికి పాజిటివ్‌.. 1,699కి చేరిన కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ కారణంగా చనిపోయినవారి సంఖ్య 45కి చేరింది. కొత్తగా 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. గురువారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో రెండు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 10 మంది వలసదారులకు ఈ వైరస్‌ సోకినట్టు వివరించారు.

మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,699కి చేరుకుందని.. అందులో వలసదారుల ద్వారా వచ్చిన కేసులే 99 ఉన్నాయని పేర్కొన్నారు. ఇక గురువారం 23 మంది కోలుకోగా, ఇప్పటివరకు 1036 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం 618 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. 14 రోజులుగా కేసులు నమోదుకాని జిల్లాలు 25 ఉన్నాయన్నారు. కాగా, హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేట శంకర్‌నగర్‌లో ఒకే కుటుంబంలోని ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మృతదేహాల ప్యాకింగ్‌ పనులు చేసే ఆ వ్యక్తికి కరోనా రావడంతో గాంధీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ర్యాపిడ్‌ కిట్స్‌పై నమ్మకం లేదు: మంత్రి ఈటల
ర్యాపిడ్‌ కిట్స్‌ మీద నమ్మకం లేదని మొదటి నుంచి చెబుతున్నామని, ఇప్పుడు ఐసీఎంఆర్‌ కూడా అదే చెప్పిందని మంత్రి ఈటల విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అలాగే కరోనా పరీక్షలు, చికిత్స ప్రభుత్వమే అందించాలని, ఆ సామర్థ్యం మనకే ఉందని స్పష్టంచేశారు. ఒక వ్యక్తి కి పాజిటివ్‌ అనితేలితే వారి కుటుంబ సభ్యులు, పాజిటివ్‌ వ్యక్తిని కలిసిన వారందరినీ ట్రేస్‌ చేసి తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైతే క్వారంటైన్‌ చేస్తున్నామని, ఇవన్నీ ప్రైవేట్‌ వ్యక్తులు చేయగలరా అని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు అన్నీ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమవుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు