అప్పు మిగిలి.. గుండె పగిలి

25 Nov, 2014 01:23 IST|Sakshi
రైతుల దుస్థితిపై ఖమ్మం జిల్లా ఇల్లెందులో వినూత్న నిరసన

* తెలంగాణలో సోమవారం ఒక్కరోజే ఐదుగురు రైతుల ఆత్మహత్య
* అప్పులెలా తీర్చాలనే ఆవేదనతో గుండె ఆగి మరో ఇద్దరు మృతి
* అన్నదాతలను బలిగొంటున్న పంటనష్టం, విద్యుత్ కోతలు, అప్పులు
* ఆధారం కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో రైతుల కుటుంబాలు

సాక్షి నెట్‌వర్క్: ఎన్నో ఆశలతో ఎదురు చూసినా కురవని వర్షాలు.. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు.. అన్నీ కలిసి రైతులను నిలువునా బలిగొంటున్నాయి.. ఆరుగాలం చేసిన కష్టం కళ్ల ముందే నాశనమవడాన్ని తట్టుకోలేక అన్నదాతలు ప్రాణాలు వదులుతున్నారు.. కుటుం బాన్ని పోషించాల్సినవారు దూరమవుతుండడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుంటున్నాయి. వర్షాభావం, విద్యుత్ కోతలు, పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో సోమవారం తెలంగాణలో ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా.. ఆవేదన కారణంగా గుండె ఆగిపోయి మరో ఇద్దరు రైతులు మృతి చెందారు.

వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన మహిళా రైతు తుప్పతి లక్ష్మి (30) తమ నాలుగెకరాల్లో కొన్నేళ్లుగా పత్తి, వరి, మొక్కజొన్న సాగుచేసింది. పెట్టుబడుల కోసం రూ. 2.5 లక్షలు అప్పు చేసింది. కానీ నాలుగేళ్లుగా పంటల దిగుబడి సరిగా లేక.. అప్పులెలా తీర్చాలనే ఆవేదనతో ఆమె ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది.

కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బట్టు ఎల్లం(32) తమ మూడెకరాల్లో వరి వేశాడు. నీటి కోసం మూడు బోర్లు వేయించాడు. కానీ వర్షాభావం, కరెంట్  కోతలతో ఖరీఫ్ పంటంతా ఎండిపోయింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులెలా తీర్చాలనే ఆందోళనతో సోమవారం ఉదయం తన పొలం వద్దే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబానికి పెద్ద దిక్కులేకుండా పోయింది. ఇక కోహెడ మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన ఎల్ల చంద్రం(45) పత్తి పంట వేసి నష్టపోయాడు. దీంతో కలత చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. అతనికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంకా చిన్న కుమార్తె వివాహం చేయాల్సి ఉంది.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన రాథోడ్ నారాయణ (50) ఐదెకరాల్లో సోయా, రెండెకరాల్లో పత్తి వేశాడు. కానీ వర్షాల్లేక దిగుబడి రాకపోవడంతో... ఆవేదన చెంది పురుగుల మందు తాగాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురం తండాకు చెందిన రైతు తేజావత్ రాంబాబు (30) రెండెకరాల్లో మిర్చి, మూడెకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంటలు ఎండిపోవడంతో పాటు బోరు వేయడం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురయ్యాడు. ఆ ఆందోళనతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు.

అప్పులు మింగేశాయి..
కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట గ్రామానికి చెందిన యెల్లాల లింగారెడ్డి(65) తమ పది ఎకరాల భూమిలో పత్తి వేశాడు. వర్షాభావం కారణంగా నష్టం రావడంతో.. ఆందోళన చెంది గుండెపోటుకు గురయ్యాడు. ఇక నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామానికి చెందిన నూకపంగు సైదులు(48) తమ నాలుగున్నర ఎకరాల్లో వరి సాగుచేశాడు. వర్షాభావం, తెగుళ్లతో పంట దెబ్బతిని కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్నాడు. ఈ ఆవేదనతోనే గుండెపోటుతో మృతి చెందాడు.

మరిన్ని వార్తలు