ఆర్మీ ర్యాలీకి ఐదు వేల మంది

7 Feb, 2016 04:51 IST|Sakshi
ఆర్మీ ర్యాలీకి ఐదు వేల మంది

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శనివారం మూడో రోజుకు చేరింది. రాష్ట్రంలోని పది జిల్లాలస్థాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సుమారు 5వేల మందికిపైగా యువకులు తరలివచ్చారు. సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో 6,258 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పదో తరగతి విద్యార్హతతో దరఖాస్తులు కోరడంతో.. అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వేలాది సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పది జిల్లాలను మూడు రోజులు విభజించి ఎంపికలు చేపట్టారు. శనివారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల్లో పలువురు ముందు రోజే వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లలోనే రాత్రంతా నిరీక్షించారు. వేకువజామున 3 గంటలకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. అనంతరం అభ్యర్థులను గ్రూపుల వారీగా దేహదారుఢ్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఎంపికైన వారికి బ్యాలెన్సింగ్ బీమ్, ఫుల్ అప్స్, లాంగ్ జంప్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. అన్నింట్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి ఆదివారం మెడికల్ పరీక్షలు చేపట్టనున్నారు.
 
 నేడు సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపికలు
 ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ఆదివారం 4 జిల్లాల అభ్యర్థులకు ఎంపికలు చేపట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన 5,776 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు