ఐటీఐలలో ఐదు ట్రేడ్‌లు ఔట్‌! 

22 Feb, 2019 01:05 IST|Sakshi

ఇంజనీరింగ్‌ కేటగిరీలో 4, నాన్‌ ఇంజనీరింగ్‌లో ఒక ట్రేడ్‌ ఎత్తివేత 

డిమాండ్‌ లేని కేటగిరీలను  ఎత్తేయాలని కార్మిక, ఉపాధి కల్పన శాఖ నిర్ణయం 

ఉపాధి అవకాశాల ఆధారంగా కొత్త కోర్సులకు కార్యాచరణ రూపకల్పన 

65 ప్రభుత్వ ఐటీఐలలో  కామన్‌ ట్రేడ్‌ ప్రణాళిక  

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లలో డిమాండ్‌ లేని ట్రేడ్‌లను రద్దు చేయాలని కార్మిక, ఉపాధి కల్ప న శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో అడ్మిషన్లను పరిగణిస్తూ.. గత మూడేళ్లుగా అడ్మిషన్ల తీరును విశ్లేషించింది. ఇప్పటికే ఐదు ట్రేడ్లలో ప్రవేశాల్లేవు. ఆయా రంగాల్లో ఉపాధి కల్పన కూడా ఆశాజనకంగా లేకపోవడంతో వాటిని రద్దు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫౌండ్రీమన్, షీట్‌ మెటల్‌ వర్కర్, రేడియో అండ్‌ టీవీ మెకానిక్, వైర్‌మెన్, సెక్రెటేరియల్‌ ప్రాక్టీస్‌ ట్రేడ్లు రద్దు కానున్నాయి. రాష్ట్రంలో 290 ఐటీఐలు ఉన్నాయి. వీటిలో 65 ప్రభుత్వ ఐటీఐలు కాగా, 235 ప్రైవేటు సంస్థ లు నిర్వహిస్తున్నాయి. వీటి పరిధిలో 50 వేల మంది వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. 

ట్రెండ్‌కు తగ్గ ట్రేడ్‌లు.. 
నైపుణ్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లో డిమాండ్‌ అంచనా వేసి నిపుణులను తయారు చేసేలా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. అక్కడున్న పరిస్థితులు, ఉపాధి అవకాశాల ఆధారంగా ఐటీఐలలో కొత్త ట్రేడ్లు ఏర్పాటు చేసుకునే వీలుంది. దీంతో డిమాండ్‌ లేని వాటిని తొలగించి కొత్త ట్రేడ్‌ల చేర్పుపై ఉపాధి కల్పన, శిక్షణల విభాగం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న ఐటీఐలలో 32 ట్రేడ్‌లు ఉన్నాయి. వీటిలో 13 ట్రేడ్‌లకు శిక్షణ కాలం ఏడాది కాగా, 18 ట్రేడ్‌లు రెండేళ్ల కాల పరిమితి కేటగిరీలో ఉన్నాయి. మెకానిక్‌ మెషీన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌ ట్రేడ్‌ పూర్తికి మాత్రం మూడేళ్లు పడుతుంది. ప్రస్తుత ట్రేడ్‌లలో ఐదింటిలో ప్రవేశాల్లేవు. తొలగించిన స్థానంలో కొత్తగా ఐదు ట్రేడ్లు చేర్చే అంశంపై ఉపాధి కల్పన, శిక్షణ శాఖ అధ్యయనం చేస్తోంది. వచ్చే విద్యా ఏడాది నాటికి కొత్త ట్రేడ్‌ల చేర్పుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఐటీఐలలో కామన్‌ ట్రేడ్‌లు అమలు చేసే దానిపైనా అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రతి ఐటీఐని పరిశ్రమలతో అనుసంధానం చేసి, ఉపాధి అవకాశాలు పెంచే లా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు