నగరంలో ఫ్లెమింగోల సందడి

24 Aug, 2019 08:17 IST|Sakshi
అమీన్‌పూర్‌ చెరువులో..

వలస వచ్చి ఇక్కడే ఉండిపోతున్న రాజహంసలు

సంబరపడుతున్న పక్షి ప్రేమికులు

అందమైన ఆ పక్షులు  సరస్సుల సౌందర్యానికి అలంకారాలుగా అమరిపోతాయి.నగరానికి వాటి రాక... ప్రకృతి ప్రేమికులను.. మరీ ముఖ్యంగా పక్షి ప్రేమికులనుఒక్కసారిగా అటెన్షన్‌లోకి తెస్తుంది. సిటీలోని లేక్స్‌వైపు పరుగులు తీయిస్తుంది. కెమెరాలకు  పనిచెబుతుంది. నగరంలో వానలతో పాటు ఫ్లెమింగో పక్షుల సందడి కూడామళ్లీ మొదలైంది.     

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణాఫ్రికా నుంచి వస్తాయీ ఫ్లెమింగో పక్షులు. చల్లని వాతావరణంలోనే ఉంటాయి కాబట్టి వానాకాలం వచ్చి మే వరకూ మన నగరంలో ఉంటాయి. చిరు ప్రాయంలో ఉండగా లేత రంగులో కనిపిస్తూ పెద్దవి అవుతుండగా పింక్‌ కలర్‌లోకి మారే వీటి అందం పర్యాటకుల్ని పక్షి ప్రేమికుల చూపులను కట్టి పడేస్తుంది.  

ఆహారం... విహారం...
నీళ్లు పుష్కలంగా ఉన్న చోట ఇవి మకాంఏర్పరచుకుంటాయి. చేపల్ని, పురుగుల్ని ఆహారంగా మార్చుకుంటాయి. ఒకవేళ అక్కడ నీరు సరిగా లేకపోతే అప్పుడు ఇవి నీటిలోని మట్టి అడుగున ఉన్న పాకుడు (అల్గే)ని ఆహారంగా తీసుకుంటాయి. అందుకే ఇవి ఎక్కువగా సరస్సుల చుట్టూ తారాడుతుంటాయి. అయితే నీటి బయట ఉన్న పాకుడును ఇవి ముట్టుకోవు. వాటి శరీరపు వర్ణం అలా రావడానికి కూడా ఆ నీటి అడుగున ఉండే పాకుడు తినడమే కారణం అంటారు.

సిటీని వదలక..  ఈ ఫ్లెమింగో పక్షులు ఒకప్పుడు కేవలంవలసపక్షులుగా మాత్రమే ఉండేవి. కాని ప్రస్తుతం   సెటిలర్స్‌గా మారినట్టు కనిపిస్తోందని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. నగరంలోని అమీన్‌పూర్‌ లేక్, ఉస్మాన్‌ సాగర్‌లతో పాటు మంజీరా సాంక్చ్యురి, అన్నాసాగర్‌ (మెదక్‌)... వంటి చోట్ల ఇవిరుతువులకు అతీతంగా తరచుగా దర్శనమిస్తున్నాయని చెప్పారు. బహుశా ఇక్కడ వాతావరణ పరిస్థితులు వాటికి అనువుగా ఉండడం వల్లనే అవి అవి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండొచ్చునన్నారు. అయితే కొందరు చెబుతున్న ప్రకారం... ఇక్కడ సరైన ఆహారం దొరకకపోవడం తద్వారా అవి అంత దూరం ఎగిరి వెళ్లడానికి అవసరమైన శక్తిని సంతరించుకోలేకపోవడం కూడా కారణం కావచ్చునని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా... ప్రస్తుతానికి నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్న ఈ ఫ్లెమింగో గెస్టులను కలిసి తనివితీరా పలకరించి పులకరించిపోదాం... పదండి. 

మరిన్ని వార్తలు