భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం

21 Dec, 2015 06:38 IST|Sakshi
భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం

ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఆదివారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై విహరించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి తీసుకువచ్చారు. నదిలో హంసవాహనంపై స్వామి వారిని ఉంచి ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. హంసవాహనుడైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారు బాణసంచా వెలుగుల నడుమ గోదావరిలో ఐదుసార్లు తిరిగారు.

స్వామివారు హంస వాహనంపై విహరిస్తున్నంత సేపు గోదావరి తీరాన భక్తులు శ్రీరామ నామ జయ జయ ధ్వానాలు చేశారు. కాగా, గతేడాది కన్నా భక్తులు ఈసారి బాగా తగ్గారు. గోదావరి నదిలో తగినంత స్థాయిలో నీరు లేకపోవటంతో హంసవాహనం(లాంచీ) తిరగడానికి కొంత ఇబ్బంది కలిగింది. ఒక చోట ఇసుకలో కూరుకుపోగా, కర్రలతో నెట్టాల్సి వచ్చింది.  సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే జరిగే ఈ అరుదైన వేడుకను తిలకించేందుకు భ క్తులు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.                       
- భద్రాచలం

మరిన్ని వార్తలు