గోదావరికి పెరుగుతున్న వరద

24 Jul, 2014 02:22 IST|Sakshi
గోదావరికి పెరుగుతున్న వరద

భద్రాచలం: గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు 31.4 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారానికి ఇది 35 అడుగులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఖమ్మం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
 
 కాగా, వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు పోటెత్తి వాజేడు-పేరూరు రహదారిపై ఆరడుగుల మేర నీరు నిలిచింది. దీంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు నాటుపడవలు ఏర్పాటు చేసి అత్యవసర ప్రయాణికులను అవతలి ఒడ్డుకు దాటిస్తున్నారు. అలాగే, వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం గోదావరి నీటి మట్టం 6.59 మీటర్లకు చేరింది. ఇక్కడ నీటి మట్టం 8.50 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
 
 తెలంగాణలో లోటు వర్షపాతం: వ్యవసాయ శాఖ
 సాక్షి, హైదరాబాద్: వర్షాలు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. నదుల పరీవాహక ప్రాంతాల్లో నీటి బొట్టు కరువైపోయింది. ఈ సీజన్‌లో రెండు నెలలు గడుస్తున్నా ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇంకా వరద నీరు ఏమాత్రం చేరడం లేదు. ఈసారి నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితికి అద్దంపట్టేలా.. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలపై రాష్ర్ట వ్యవసాయ శాఖ తాజాగా ఓ నివేదిక రూపొందించింది. బుధవారం(జూలై 23) నాటికి ఉన్న నీటి నిల్వలను, గత ఏడాది సరిగ్గా ఈ సమయానికి ఉన్న నిల్వలతో పోల్చి చూపింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైనట్లు కూడా పేర్కొంది.
 
  రాష్ర్టవ్యాప్తంగా తేలికపాటి వర్షాలే తప్ప ఇప్పటివరకు భారీ వర్షాలు పడలేదు. దీంతో 10 జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈ సీజన్ జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి సాధారణంగా 298.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 140.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇంకా 53 శాతం కొరత ఉంది. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం ఉండగా.. నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో 60 నుంచి 99 శాతం లోటు నమోదైంది. సాగునీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వరి నాట్లు మొదలయ్యాయి. సాగర్, సింగూర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లలో నీటిమట్టం నిరాశాజనకంగా ఉంది.

మరిన్ని వార్తలు