నేడు విశాఖ శారద పీఠాధిపతులకు పుష్పాభిషేకం 

26 Jun, 2019 03:16 IST|Sakshi
గంగు ఉపేంద్ర శర్మ

హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్యాధికారం చేపట్టేలా రాజశ్యామల యాగం నిర్వహించిన విశాఖ పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఇటీవల విశాఖ పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిలకు ఈ నెల 26న పుష్పాభిషేకం నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. రెజిమెంటల్‌బజార్‌లోని సంతోషీమాత దేవాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో బుధవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా పుష్పాభిషేకంతో పాటు స్వాత్మానందేంద్ర స్వామి పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున కట్టు, బొట్టుతో తరలిరావాలని సూచించారు. 

తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిలు బ్రాహ్మణులకు అత్యధిక ప్రా«ధాన్యతనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ శారదా పీఠం ఆ«ధ్వర్యంలో సాంస్కృతిక పాఠశాల, వేద పాఠశాల, సంస్కృత పాఠశాల నిర్వహణ కోసం కోకాపేటలో రెండు ఎకరాల స్థలం కేటాయించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అర్చకులకు ప్రభుత్వం నుంచి వేతనాలు అందిస్తున్నారని అభినందించారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడిగా శేషం రఘుకిరణాచార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాహ్మణ సంఘాల ముఖ్యులు పవన్‌కుమార్, భాస్కరభట్ల రామశర్మ, కులకర్ని నరేశ్, శ్రీపాదశర్మ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు