ఫ్లో కంట్రోల్‌

13 Mar, 2018 10:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘మిషన్‌ భగీరథ’లో నూతన విధానం

పైప్‌లైన్లకు నియంత్రణ వాల్వ్‌ల ఏర్పాటు

తాగునీటి సరఫరాలో సమన్వయం కోసం..

ప్రతి ఇంటికి సమానంగా నీరు

కొనసాగుతున్న పనులు 

నిజామాబాద్‌అర్బన్‌: మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీటిని అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఎత్తు, పల్లాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఒకే విధంగా నీరు సరఫరా అందించేలా చూస్తోంది. ఇందుకోసం నూతన పద్ధతిని అమలులోకి తీసుకొస్తోంది. ఇంటింటికి నల్లా ద్వారా నీరు అందించే క్రమంలో నీటి సరఫరాలో లోపాలు ఏర్పడకుండా, ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరందేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.

మిషన్‌ భగీరథ పైప్‌లైన్లకు ‘ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌’ అమర్చడం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని సరఫరా చేయనుంది. జిల్లావ్యాప్తంగా ఇది వరకే కొన్నిచోట్ల పైప్‌లైన్లు వేయగా, అవసరమున్న చోట ఆ పైప్‌లైన్లకు ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌లు అమర్చుతున్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి ద్వారా ఎత్తైన ప్రాంతాలు, తండాలు, మారుమూల గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగనున్నాయి. 

ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ అంటే.. 
జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు ఇంటింటికి నల్లా కనెక్షన్ల పనులు కూడా కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2165.45 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం జరగాల్సి ఉండగా, ఇప్పటికే 670.45 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మాణానికిగాను పైపులు సరఫరా అయ్యాయి. కాగా ఇందులో 552.33 కిలోమీటర్ల పైపులైన్‌ల నిర్మాణం పూర్తయింది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2,86,494 లక్షల నల్లా కనెక్షన్లు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 37,834 నల్లా కనెక్షన్లు అందించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందించేందుకుగాను పైపులైన్‌లకు ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ను అమరుస్తున్నారు.

ఈ వాల్వ్‌లను పైప్‌లైన్‌లో అవసరమున్న చోట ఏర్పాటు చేయడం ద్వారా నీరు ఒకే ప్రాంతానికి వేగంగా వెళ్లకుండా, అన్ని ప్రాంతాలకు నీటిని సమానంగా అందే వీలుంటుంది. బంతి మాదిరిగా ఉండే వాల్వ్‌ను పైపులైన్‌లో ఏర్పాటు చేస్తారు. ఈ వాల్వ్‌కు ఉండే రంధ్రాలు నీటి ఉధృతిని నియంత్రించి, ఒకే ప్రాంతానికి వెళ్లకుండా నీటి సరఫరాను సమన్వయం చేస్తుంది. ఎత్తు నుంచి పల్లానికి నీరు వేగంగా ప్రవహిస్తుంది.. కాబట్టి పైప్‌లైన్లకు ఈ వాల్వ్‌లను అమర్చుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎత్తుపల్లాలు ఉన్నచోట ఈ విధానం అమలు చేస్తే అందరికి సమానంగా నీరు అందుతుంది. 

వాల్వ్‌ ఏర్పాటుకు ప్రాంతాల గుర్తింపు.. 
ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఎత్తుపల్లాలను గుర్తించి పైప్‌లైన్లకు ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకే కొన్ని చోట్ల పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తికాగా, ఈ వాల్వ్‌లు ఏర్పాటు చేసేందుకు మళ్లీ తవ్వి పూడ్చివేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇదివరకే వాల్వ్‌ల ఏర్పాటు కూడా జరిగింది. గతంలో మున్సిపాలిటీల్లో నీటి నియంత్రణకు పైపులకు స్ప్రింగ్‌ల మాదిరి ఉండే పరికరాలను ఏర్పాటు చేసి నీటిని కంట్రోల్‌ చేసేవారు. అయితే కొన్నిరోజులకు స్ప్రింగ్‌లు సాగకపోవడంతో ఈ పద్ధతి విఫలమైంది.

ఈ స్థానంలో ప్రస్తుతం ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ విధానంను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని తండాలు, గ్రామ పంచాయతీలు, ఎత్తు ప్రాంతంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో శివారు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను ఇదివరకే గుర్తించారు. మిషన్‌ భగీరథలో నూతన వాల్వ్‌ విధానం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు