ప్రస్తుతానికి పచ్చదనం సేఫ్‌

27 Sep, 2017 02:11 IST|Sakshi

కేబీఆర్‌ పార్కు 3 జంక్షన్ల వద్దే ఫ్లైఓవర్ల పనులు

దసరా తరువాత పనులు చేపట్టే అవకాశం

ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు ఏడాదిన్నర కాలంగా వాయిదా పడుతూ వస్తున్న కేబీఆర్‌ పార్కు చుట్టూ మల్టీ లెవెల్‌ ఫ్లై ఓవర్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పర్యావర ణానికి, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తొలిదశ లో మూడు జంక్షన్ల వద్ద పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పనులకు అనుమతించాల్సిందిగా కోరుతూ జీహెచ్‌ఎంసీ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే.. దసరా తర్వాత మూడు జంక్షన్ల వద్ద పనులు చేపట్టను న్నారు. అన్ని జంక్షన్ల వద్ద ఒకేసారి పనులు చేపడితే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తడంతోపాటు, పర్యావరణ ప్రేమికుల నుంచి ఎదురయ్యే అభ్యంతరాలతోపాటు వెచ్చించాల్సిన నిధులు తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతానికి మూడు జంక్షన్ల వద్ద మాత్రం పనులు చేయాలని భావించారు. తద్వారా భూసేకరణ అవసరం తగ్గడంతోపాటు ట్రాన్స్‌ లొకేట్‌ చేయాల్సిన/ తొలగించాల్సిన చెట్లు సైతం సగానికి పైగా తగ్గనుండటం తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటూ తాజా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ల వద్ద జరిగిన సమావేశాల సందర్భంగానూ వీటి నిర్మాణ పనుల సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బం దుల్లేకుండా చూడాలని వారు ఆదేశించడంతో అందుకనుగుణంగా కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మూడు జంక్షన్ల వద్ద పనులు చేపట్టేందుకు ఎవరి నుంచీ, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపో వడంతో వీలైనంత త్వరితంగా ఈ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఆటంకాలివీ..
మొత్తం 6 జంక్షన్లలో పనులు చేపట్టేందుకు టెండర్లు పూర్తి చేసినప్పటికీ, భూసేకరణ, వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, క్యాన్సర్‌ ఆస్ప త్రి జంక్షన్ల వద్ద పనుల్ని పెండింగ్‌లో పెట్టారు. మిగతా 4 ప్రాంతాల్లో పనులకు పర్యావరణ ప్రేమికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఎన్జీటీ స్టేతో పనులను నిలిపి వేశారు. తుది తీర్పుని చ్చిన ఎన్జీటీ ఎకో సెన్సిటివ్‌ జోన్‌కు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ తుది నోటిఫికేషన్‌ అ నంతరం పనులు చేపట్టాల్సిందిగా సూచించింది. దీంతో ఏడాదికి పైగా పనులు ఆగిపోయాయి.

మూడు జంక్షన్లలో పనులకు నో అబ్జెక్షన్‌..
ఎకో సెన్సిటివ్‌ జోన్‌తో సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏ ఆటంకాలు వ్యక్తం కాకుండా, పెద్దగా భూసేకరణ అవసరం లేకుండా 3 ప్రాంతాల్లో పనులు చేపట్టవచ్చని భావించారు. ఆ మేరకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, రోడ్‌ నంబర్‌ 45, పార్కు ప్రవేశ ద్వారం వద్ద పనులు చేయాలని ప్రతిపాదించారు. జీహెచ్‌ఎంసీ వద్ద తగినన్ని నిధులు కూడా లేకపోవడంతో తొలుత ఈ పనులు చేస్తే చాలనే నిర్ణయానికి వచ్చారు. తొలగించా ల్సిన 1,400 చెట్లలో సగం చెట్లు కూడా తొలగించాల్సిన అవసరం లేదని గుర్తించారు.


చేపట్టబోయే పనులు ఇలా..
కేబీఆర్‌ పార్కు ఎంట్రన్స్‌ వద్ద..
 జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రి వైపు రెండు లేన్లతో మొదటి వరుస ఫ్లైఓవర్‌
⇒ పంజగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు మూడు లేన్లతో రెండో వరుస ఫ్లైఓవర్‌
⇒ తొలుత రెండో వరుస ఫ్లైఓవర్‌ నిర్మిస్తారు.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద..
⇒ సినీమ్యాక్స్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36 వైపు ఆరులేన్లతో మొదటి వరుస ఫ్లైఓవర్‌. దీనిపై రెండు వైపులా వెళ్లవచ్చు.
⇒ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 వైపు నుంచి సినీమ్యాక్స్‌ వైపు రెండు లేన్లతో రెండో వరుస ఫ్లైఓవర్‌
⇒ ఇక్కడ మొదటి వరుస ఫ్లైఓవర్‌ పనులు పూర్తయ్యాక రెండో వరుస పనులు చేపడతారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45 వద్ద..
⇒ ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి చెక్‌పోస్ట్‌ వైపు మొదటి వరుస ఫ్లై ఓవర్‌.
⇒ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి రోడ్‌ నంబర్‌ 45 వైపు రెండో వరుస ఫ్లైఓవర్‌.
⇒ రెండో వరుస ఫ్లైఓవర్‌ తొలుత పూర్తిచేస్తారు.

తొలుత ప్రతిపాదించిన జంక్షన్లు
⇒ కేబీఆర్‌ పార్కు ఎంట్రన్స్‌
⇒ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌
⇒ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45
⇒ మహరాజ అగ్రసేన్‌ విగ్రహం
⇒ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి
⇒ ఫిల్మ్‌నగర్‌

మరిన్ని వార్తలు