రేడియోతో.. ఎవేర్‌నైస్‌

9 May, 2020 08:10 IST|Sakshi

అలరిస్తూ.. కరోనాపై అవగాహన కల్పిస్తూ..

కోవిడ్‌–19 వార్‌లో తాము సైతం అంటున్న ఆర్జేలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రోతలతో పెరిగిన అనుబంధం

సరదా కబుర్లూ, నవ్వించే ముచ్చట్లతో శ్రోతలకు చిరపరిచితమైన ఆర్జేలు.. లాక్‌డౌన్‌తో నగరవాసులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు తమ ఆటపాటలను వినిపులకరించేవారితో పాటు తమను ఆప్యాయంగా
పలకరించేవారు కూడా పెరిగారని సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్జేలు కరోనాపై అవగాహనకు తమవంతు కృషిచేస్తున్నామంటున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: మాట, పాటలతో నిత్యం అలరించే ఎఫ్‌ఎమ్‌లు కరోనా వారియర్స్‌గా తామూ పదం కదుపుతున్నారు. కార్యక్రమాలన్నీ కరోనా నేపథ్యంలో కొనసాగిస్తూ తమ చానెల్స్‌ ద్వారా శ్రోతలకు అవగాహన కల్పిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎఫ్‌ఎమ్‌లు వినేవారితో పాటు తగినంత ఖాళీ సమయం ఉండటంతో తమతో సంభాషించడం కూడా పెరిగిందంటూ ఆర్జేలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అవగాహనకే ప్రాధాన్యం..
వందనం.. సింగిడి.. రిమ్‌జిమ్‌ హైదరాబాద్‌ తదితర కార్యక్రమాల్లో ఆర్జేలు వినోదానికి విజ్ఞానాన్ని కూడా జోడిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, డాక్టర్లు, పోలీస్‌ అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్‌–19పై స్పెషల్‌ బులెటిన్స్‌ను ప్రతి గంటకు ఆల్‌ ఇండియా రేడియో న్యూస్‌ విభాగం అందిస్తోంది. కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను భవిష్యత్‌ ప్రణాళికలను, ఏర్పాట్లను ఆయా విభాగాల అధికారులు, మంత్రులతో చర్చలను ప్రసారం చేస్తున్నారు.

కోవిడ్‌–19పై ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఆకాశవాణి హైదరాబాద్‌ సోషల్‌ మీడియా(ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌)ల ద్వారా నిర్వహిస్తోంది. డ్యూటీలు నిర్వహిస్తున్న ఆర్జేలందరికీ మాస్క్‌లు, శానిటైజర్లను రేడియో చానెల్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు.

నివృత్తి.. మా బాధ్యత..
చాలామందికి కరోనాపై ఎన్నోఅనుమానాలున్నాయి. వీలైనంత వరకూ వాటిని నివృత్తి చేయడం నా బాధ్యతగా ఫీలవుతున్నా. పలువురు నిపుణులతో నిరంతరం సంప్రదించి, వారితో లైవ్‌లో మాట్లాడించి వారి
సందేహాలను నివృత్తి చేస్తున్నాం.  – ఆర్జే అనూష

రేడియోకి టీఆర్పీ బాగా పెరిగింది..
లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం రేడియోకి టీఆర్పీ బాగా పెరిగింది. కరోనా టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి ప్రసారాలు నిర్వహిస్తున్నాం. ఆర్జేలు ఎంతో ఉత్సాహంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. శ్రోతలకు, ఆర్జేలకు మధ్య ఓ అనుబంధం ఉంటుంది.  – కామేశ్వరి, ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్,రెయిన్‌బో ఎఫ్‌ఎమ్‌

ఇమ్యూనిటీ టిప్స్‌ ఇస్తున్నాం..
ఈ టైంలో శారీరక, మానసిక ఆరోగ్యాలను ఎలా కాపాడుకోవాలి? మనలో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి? అనే అంశాలపై ఇన్ఫర్మేషన్‌ అందిస్తున్నాం. అవి మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని లిజనర్స్‌ చెబుతుంటేసంతోషంగా ఉంది.  – ఆర్జే లక్కీ

బాధ్యతగా ఫీల్‌ అవుతున్నాం..
ఇప్పుడు ఇది మాకు కేవలం ఉద్యోగం కాదు.. ఒక బాధ్యతగా ఫీల్‌ అవుతున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి ఓ వైపు వినోదం అందిస్తూ మరోవైపు అవగాహన పెంచడం అనేది ఓ సామాజిక బాధ్యతగా భావిస్తున్నాం.ప్రేక్షకుల స్పందన వస్తోంది.  – ఆర్జే డా.సురభి రమేష్‌

సార్థకత చేకూరుతోంది..
ఉల్లాసపరచడం తెలిసిన విషయమే.. అయితే దానితో పాటు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం, పంచుకోవడం అనే కొత్త బాధ్యత స్వీకరించాం. ఇలాంటి సమయాల్లోనే మన వృత్తి ధర్మానికి సార్థకత చేకూరినట్టు అనిపిస్తోంది.  – ఆర్జే సునీల్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు