మెడికల్‌ డివైజెస్, ఫార్మాసిటీలపై ఫోకస్‌ పెట్టండి

18 Aug, 2017 07:40 IST|Sakshi
మెడికల్‌ డివైజెస్, ఫార్మాసిటీలపై ఫోకస్‌ పెట్టండి
  • నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
  • అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం
  • 8,500 ఎకరాలు అవసరమని ప్రాథమిక అంచనా
  • ఈ పార్కుల ద్వారా కలిగే లాభాలను ప్రజలకు తెలపండి
  • ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో
  • రాష్ట్రం మళ్లీ నంబర్‌ వన్‌గా నిలవాలి
  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఫార్మా సిటీ, మెడికల్‌ డివైజెస్‌ పార్కుల పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిర్ణీత గడువులోగా వీటిని పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఏరోస్పేస్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. భాగ్యనగరంలో ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక కంపెనీలు ఉన్నాయని, మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను నగరానికి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.

    ఇప్పటివరకు పలు కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆసక్తిని బట్టి ఈ రెండు పార్కులకు ప్రాథమికంగా దాదాపు 8,500 ఎకరాల డిమాండ్‌ ఉందని తెలిపారు. పర్యావరణ అనుమతులకు సంబంధించి త్వరలోనే బహిరంగ విచారణ ఉన్నందున ఫార్మా సిటీ ద్వారా కలిగే లాభాలు, ఉద్యోగావకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జీరో లిక్విడ్‌ డిశ్చార్జి సదుపాయాలు కల్పిస్తున్నందున కాలుష్య ప్రమాదం కూడా ఉండదన్న విషయాన్ని వివరించాలని అధికారులను ఆదేశించారు. గురువారమిక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేటీఆర్‌.. పరిశ్రమల శాఖ, ఐటీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు శాఖల్లో అమల్లో ఉన్న కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

    టాస్క్‌ను జిల్లాలకు విస్తరించండి
    తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతో సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు వివరించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతోపాటే తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కూడా పూర్తవుతుందని చెప్పారు. టాస్క్‌ ద్వారా ఇప్పటిదాకా ప్రధానంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, త్వరలో ఈ శిక్షణ కార్యక్రమాలను హెల్త్, ఫార్మా, అటోమోటివ్స్‌ రంగాలకు విస్తరిస్తామని తెలిపారు. టాస్క్‌ కేంద్రాలను జిల్లాలకు విస్తరించేందుకు దశల వారీగా ప్రయత్నాలు ప్రారంభించాలని మంత్రి అధికారులకు సూచించారు.

    ప్రతి మూడు నెలలకోసారి శాఖాపరమైన మైలురాళ్లను ముందే తెలియజేయాలన్నారు. ఈ లక్ష్యం అందుకోలేని అధికారులపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. గతేడాది ఈజ్‌ అఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈసారి అదే స్థానాన్ని కొనసాగించేలా పనిచేయాలని అధికారులను కోరారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల కమిషనర్‌ నదీమ్‌ అహ్మద్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు