‘మార్కెట్’ పదవులపై కన్ను

29 Sep, 2014 00:05 IST|Sakshi
‘మార్కెట్’ పదవులపై కన్ను

 రిజర్వేషన్ విధానం యోచనతో సామాజికవర్గాల నేతల సందడి
 చేవెళ్ల:  చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకమండళ్ల చైర్మన్ పదవులకోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతమున్న కమిటీల పదవీకాలం ముగియకున్నా ఆర్డినెన్స్‌ద్వారా ఈ పాలకమండళ్లను రద్దుచేసింది. ఈస్థానాల్లో తమ పార్టీవారిని నియమించాలని  ప్రభుత్వం భావిస్తోంది.  ఇప్పటివరకు ఓపెన్‌కెటగిరీ కింద మార్కెట్ కమిటీ పాలకమండళ్లను గత ప్రభుత్వాలు నియమించేవి. అలా కాకుండా వీటిలో కూడా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెడతామని  ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా తెలియజేశారు. దీంతో పలు సామాజిక వర్గాల టీఆర్‌ఎస్ నేతలు ఈ పదవులకోసం పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు.
 
నియోజకవర్గంలో మూడు కమిటీలు
చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్, నవాబుపేట మండలాలున్నాయి.  నియోజకవర్గ పరిధిలో  చేవెళ్ల, శంకర్‌పల్లి, సర్దార్‌నగర్ మార్కెట్‌కమిటీలున్నాయి. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి చేవెళ్ల మండలం, శంకర్‌పల్లి మార్కెట్‌పరిధిలోని శంకర్‌పల్లి మండలం, సర్దార్‌నగర్ మార్కెట్ పరిధిలోకి షాబాద్, మొయినాబాద్ మండలాలు వస్తాయి. నవాబుపేట మండలం మాత్రం వికారాబాద్ మార్కెట్ పరిధిలోకి వస్తుంది. ఈ పాలకమండళ్లకు కోసం ఆయా మండలాల టీఆర్‌ఎస్ నేతలు పోటీపడుతున్నారు. ఇదిలాఉండగా సర్దార్‌నగర్ నుంచి మొయినాబాద్ మండలాన్ని, వికారాబాద్ మార్కెట్‌నుంచి నవాబుపేటను వేరుచేసి కొత్త కమిటీలను ఏర్పాటుచేయాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది.
 
నేతల ఉత్కంఠ
మార్కెట్ పదవులలో ప్రవేశపెట్టనున్న రిజర్వేషన్ విధానం ఇంకా నిర్ణయించకపోవడంతో ఏ మార్కెట్‌కమిటీ ఏ కేటగిరీకి చెందుతుందోనని ఆశావహులు ఉత్కంఠతో ఉన్నప్పటికీ తమవంతు ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరీ కోసం మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు సామ మాణిక్‌రెడ్డి పోటీపడుతున్నారు. రిజర్వేషన్ విధానం అమలై ఎస్సీ అయితే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.వసంతం, గంగియాదయ్య,  బీసీ అయితే రావులపల్లి మాజీ సర్పంచ్ రాంచంద్రయ్య, కె.పాండు, సత్యనారాయణగౌడ్ తదితరులు పోటీలో ఉంటారు.

అదే విధంగా సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి వస్తే షాబాద్ మండలం  చందనవెళ్లికి చెందిన కొలన్ ప్రభాకర్‌రెడ్డి, కక్కులూరుకు చెందిన మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ జీవన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. బీసీకి కేటాయిస్తే నాగరకుంటకు చెందిన వెంకటయ్యకే  అవకాశాలున్నాయి. అదే విధంగా శంకర్‌పల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయిస్తే  సంకెపల్లికి చెందిన చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవుని పరమేశ్వర్‌రెడ్డి, మహాలింగపురం గ్రామానికి చెందిన బల్వంత్‌రెడ్డి పోటీపడుతున్నారు. బీసీలకు కేటాయిస్తే శంకర్‌పల్లికి చెందిన బొమ్మనగారి కృష్ణ, మోకిలకు చెందిన లింగం, ఎస్సీలకు రిజర్వు చేస్తే మహారాజ్‌పేటకు చెందిన సామయ్య, జన్వాడకు చెందిన యాదయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
 
మంత్రిపైనే భారం
మంత్రి మహేందర్‌రెడ్డిపైనే మార్కెట్‌కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవుల ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశీస్సుల కోసం చక్కర్లు కొడుతున్నారు. మంత్రి సోదరుడు , ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ద్వారా  సిఫార్సు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ద్వారా   విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నీటిపారుదల, మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు సోమవారం చేవెళ్ల, వికారాబాద్‌లలో పర్యటిస్తున్న సందర్భంగా  ఆయనను ప్రసన్నం చేసుకునేం దుకు కూడా ఆశావహ నేతలు  సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు