వృత్తి విద్యా ఫీజులపై కసరత్తు! 

17 Dec, 2018 02:01 IST|Sakshi

  ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ నియామకంపై దృష్టి

  ఆ లోగా కాలేజీల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులకు వచ్చే మూడేళ్లపాటు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారుకు కసరత్తు ప్రారంభమైంది. 2016–17 విద్యా సంవత్సరంలో ఖరారు చేసి అమల్లోకి తెచ్చిన ఫీజుల కాలపరిమితి  2018–19తో ముగిసింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో  ఏటా వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారుకు అవసరమైన చర్యలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. గత మూడేళ్లలో కాలేజీల ఆదాయవ్యయాలను పరిశీలించి, వచ్చే మూడేళ్లకు ఫీజులను హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా వ్యవహరించే తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేస్తుంది. 2016లో నియమించిన ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ పదవీకాలం రెండు నెలల కిందటే ముగిసింది.  

కొత్త చైర్మన్‌ను నియమించిన తరువాతే ఫీజుల ఖరారుకు చర్యలు ప్రారంభించే అవకాశముంటుంది.  ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రక్రియను ప్రారంభించినా చైర్మన్‌ను నియమించేందుకు సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో తమకు అధికారం ఇస్తే కోర్సుల వారీగా ఫీజుల ఖరారుకు కాలేజీ యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని మండలి పేర్కొంది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మండలి నేరుగా దరఖాస్తులను స్వీకరించే అధికారం లేనందున, ఏఎఫ్‌ఆర్‌సీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించే విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఈ వారంలో లేదా వచ్చేవా రంలో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశ ముంది. ఆ వెనువెంటనే మెడికల్, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, బీఈడీ తదితర వృత్తి విద్యా కాలేజీల నుంచి కాలేజీలవారీగా మూడేళ్ల ఆదాయ వ్యయాలు, ఫీజు పెంపు ప్రతిపాదనలను స్వీకరించనుంది. అయితే గతంలో వాటి స్వీకరణకు రెండు నెలల సమయం ఇచ్చినా, ఈసారి నోటిఫికేషన్‌ జారీ ఆలస్యం అయినందున ప్రతిపాదనల స్వీకరణ గడువును తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, కోర్సుల్లో కనీసంగా 10 శాతం వరకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు