సమాజ అవసరాలు తీర్చే పరిశోధనలకు పెద్దపీట

6 Aug, 2018 00:30 IST|Sakshi

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి, హైదరాబాద్‌: సుస్థిరాభివృద్ధికి అత్యంత కీలకమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వాలతోపాటు ప్రైవేట్‌ రంగం కూడా ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సమాజ అవసరాలను తీర్చే వినూత్న పరిశోధనలకు పెద్దపీట వేయాలని శాస్త్రవేత్తలను కోరారు. సీఎస్‌ఐఆర్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకల ప్రారంభం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పరిశోధన సంస్థలు యువ శాస్త్రవేత్తల ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కోరారు. భూతాపోన్నతి, వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తులో స్వచ్ఛమైన నీరు, తగిన ఆహారం లభించడం కూడా పెను సవాళ్లుగా మారనున్నాయని, శాస్త్రవేత్తలు వీటిని అధిగమించడంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. దశాబ్దాల క్రితం హరిత విప్లవం దేశ ఆహార అవసరాలను తీరిస్తే, నేడు మేధో విప్లవం సాయంతో వ్యవసాయం, రైతుల సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు.

దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాల ఉత్పత్తి అవసరమని, దానికి అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలే కాదు, సామాన్యుడు కూడా మన దేశానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని, వారి భద్రతకు చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు.

‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌’ మన దేశానికి చాలా అవసరమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన అందరికీ ఆరోగ్యం, విద్య అందాలన్నా, లింగవివక్ష అంతం కావాలన్నా మన ఆలోచన విధానం మారాలని వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న పరిశోధన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,227 వరకూ ఉంటే అందులో సీఎస్‌ఐఆర్‌ తొమ్మిదో స్థానంలో ఉండటం దేశానికే గర్వకారణమని కొనియాడారు.

ఒక్కతాటిపైకి తెచ్చాం: హర్షవర్ధన్‌
నాలుగేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చిన తరువాత సీఎస్‌ఐఆర్‌తోపాటు దేశంలోని అన్ని పరిశోధన సంస్థలను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగామని, ఫలితంగా దేశంలో పరిశోధనల తీరుతెన్నులు మారిపోయాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. సీఎస్‌ఐఆర్‌లోని మొత్తం 37 సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన డెహ్రాడూన్‌ డిక్లరేషన్‌ ద్వారా దేశంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు చేపట్టడం సాధ్యమైందని, ఐఐసీటీ  వైద్యం, ఇంధన రంగాల్లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్వహిస్తోందన్నారు.

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ మాట్లాడుతూ వ్యవసాయానికి కీలకమైన కీటకనాశినులను దేశీయంగా తయారు చేయడం మొదలుకొని ప్రాణాధార మందులను జెనరిక్‌ రూపంలో చౌకగా అందించడం వరకూ ఐఐసీటీ చేసిన సేవ ఎంతో ముఖ్యమైందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్, సీనియర్‌ శాస్త్రవేత్తలు ఎన్‌.వి.సత్యనారాయణ, శైలజ దోనంపూడి, ఐఐసీటీ మాజీ డైరెక్టర్లు, దేశవ్యాప్త సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు