మూగజీవాలకు పశుగ్రాసం కొరత

14 Mar, 2019 05:11 IST|Sakshi

సబ్సిడీపై తీసుకుంటున్న గొర్రెలకూ మేత దొరకని స్థితి

అవి చనిపోయేందుకు అవకాశం ఉందంటున్న లబ్ధిదారులు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ వేసవిలో మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడనుంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. 16 జిల్లాల్లోని, 70 మండలాల్లో ఈ ప్రభావం ఉండనుంది. వాస్తవానికి అన్ని జిల్లాల్లోని మూగజీవాలకు మేత కష్టాలు తప్పేలా లేవు. వేసవి వచ్చినపుడే పశుగ్రాసం గుర్తు రావడం, ముందస్తు ప్రణాళికలు వేసుకోకపోవడంతోనే పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. వేసవిలో పశుగ్రాసం కొరత సాధారణమేనని కొందరు అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. పశుసంవర్ధకశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4.27 కోట్ల పశువులు ఉన్నాయి. వీటికి జనవరి నుంచి జూన్‌ వరకు 111.27 లక్షల మెట్రిక్‌ టన్నుల మేత అవసరం కాగా, 109.77 లక్షల మెట్రిక్‌ టన్నుల గ్రాసం మాత్రమే అందుబాటులో ఉంది. ఎండు మేతను తీసుకుంటే 101.11 లక్షల మెట్రిక్‌ టన్నుల అవసరం ఉండగా, 82.57 టన్నులు అందుబాటులో ఉందని పశుసంవర్థక శాఖ తన నివేదికలో పేర్కొంది.  

16 జిల్లాల్లో అధికం 
జనగాం, ఆదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్‌ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొరత తీవ్రంగా ఉంది. కొత్తగూడెం జిల్లాలో మూడు మండలాలు, భూపాలపల్లిలో రెండు, మహబూబాబాద్‌లో రెండు, మంచిర్యాల్‌లో ఐదు, నల్లగొండలో 18, నిర్మల్‌లో మూడు, సిరిసిల్లలో రెండు, రంగారెడ్డిలో 16, వికారాబాద్‌లో 6, యాదాద్రి భువనగిరిలోని 13 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు పేర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో సరిపోను గ్రాసం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గొర్రెలకు పచ్చదనం లేక మేత దొరకని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ సబ్సిడీ గొర్రెల పంపిణీ జరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. వాటి మేతకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇస్తే వేసవిలో అవి చనిపోతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రత్యామ్నాయాలపై దృష్టి
సాధారణంగా వేసవిలో పశుగ్రాసం కొరత ఉంటుంది. అయినప్పటికీ కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాం. పశువుల తాగునీటికోసం కొత్తగా 8 వేల నీటి తొట్లను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 12 వేల నీటి తొట్లు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ సహకారంతో అదనపు తొట్లు నిర్మిస్తున్నాం. 
    – డాక్టర్‌ ఎస్‌.రామచందర్, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు   

మరిన్ని వార్తలు