ఇంటివాడైన జానపద గాయకుడు రషీద్‌

20 Jan, 2020 11:31 IST|Sakshi
రేలారే.. రేలా.. ఫేమ్, ప్రముఖ జానపద అంధ గాయకుడు మహమ్మద్‌ రషీద్

నిజామాబాద్‌ ,డిచ్‌పల్లి: రేలారే.. రేలా.. ఫేమ్, ప్రముఖ జానపద అంధ గాయకుడు మహమ్మద్‌ రషీద్, మరో అంధ గాయకురాలు సమీరా(దీప)ను పెళ్లి చేసుకుని ఆదివారం ఓ ఇంటివాడయ్యాడు. రషీద్‌ అచ్చమైన పల్లె పాటలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నాడు. మండలంలోని నడపల్లి జీపీ పరిధిలో గల గాంధీనగర్‌ కాలనీకి చెందిన రషీద్, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఫాతిమానగర్‌కు చెందిన సమీరా ఇద్దరూ హైదరాబాద్‌ బేగంపేట్‌ దేవనర్‌ ఫౌండేషన్‌లో చదువుకున్నారు.

అదే సమయంలో రషీద్‌ టీవీ షోలతో బిజీతో చదువుకు తాత్కాలికంగా దూరం కావాల్సి వచ్చింది. తిరిగి మూడేళ్ల క్రితం రషీద్‌ డిగ్రీలో చేరడంతో మరోసారి ఇద్దరు ఒకే చోట కలిశారు. ఇద్దరు గాయకులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. గిరిజన కుటుంబానికి చెందిన దీప తల్లిదండ్రులు రాజేశ్వరి, రామదాస్‌ మరణించడంతో తాత కోక్యా, నానమ్మ పుల్లమ్మ వద్ద పెరిగింది. రషీద్‌తో పెళ్లి కోసం దీప తన పేరును సమీరాగా మార్చుకుంది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఆమోదించడంతో ఆదివారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లోని షాదీఖానాలో పెళ్లి జరిపించారు. కట్న కానుకలు తీసుకోకుండా మతాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన రషీద్, సమీరా జంటను బంధువులు, కుటుంబీకులతో పాటు ఇరువర్గాల పెద్దలు, మండల ప్రజలు అభినందించి ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు