నియంత్రిత సాగే రైతు‘బంధు’

22 May, 2020 02:02 IST|Sakshi

అన్నదాతలు వందశాతం లబ్ధి పొందాలన్నదే నా అభిమతం: కేసీఆర్‌

 ఆ మేరకే ప్రభుత్వం రైతులకు సూచనలు చేస్తుంది

సర్కారు చెప్పినట్టు పంటలు వేస్తే రైతన్నలు నష్టపోరు

 నాలుగైదు రోజుల్లో క్లస్టర్లవారీగా రైతు సదస్సులు

ఎర్రవెల్లిలో నా సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మిస్తా

25లోగా ఖాళీగా ఉన్న ఏఈఓ పోస్టుల భర్తీ

నియంత్రిత సాగుపై విస్తృత సమీక్షలో సీఎం స్పష్టీకరణ

ఏ సీజన్‌లో ఎక్కడ ఏ పంట వేయాలో శాస్త్రవేత్తలు నిర్ణయించారు

సాక్షి, హైదరాబాద్‌ : నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘రైతులంతా ఒకే పంట వేస్తే డిమాండ్‌ పడిపోయి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి? ఏ రకం సాగు చేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉందో ఆగ్రో బిజినెస్‌ విభాగం వారు నిర్ధారించారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తుంది. ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండదు’అని సీఎం పేర్కొన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానంపై ఆయన గురువారం ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు.

70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
‘రాష్ట్రంలో గతేడాది తరహాలోనే వర్షాకాలంలో40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలి. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి. గతేడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లోకంది పంట వేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గతేడాది మాదిరిగానే వేసుకోవచ్చు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగు చేసుకోవచ్చు. వర్షకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు కాబట్టి, అది వద్దు. యాసంగిలో మక్కలు వేసుకోవచ్చు. వర్షాకాలంలో మక్కలు వేసే అలవాటు ఉన్న వారు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలి. వరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డిమాండ్‌ ఉన్న తెలంగాణ సోనా రకం వేసుకోవాలి. 6.5 ఎంఎం సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్‌ ఉంది. దానిని కూడా పండించాలి’అని ముఖ్యమంత్రి సూచించారు.

సీఎం సమీక్షలో పాల్గొన్న రైతు బంధు సమితుల అధ్యక్షులు, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు

2,602రైతు వేదికలు..
రాష్ట్రంలోని 2,602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తన వ్యవసాయ క్లస్టర్‌ అయిన ఎర్రవెల్లిలో సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మిస్తానని సీఎం ప్రకటించగా.. రాష్ట్రంలోని మంత్రులందరితో పాటు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా సొంత ఖర్చుతో రైతు వేదికలను నిర్మించడానికి ముందుకొచ్చారు.  

గురువారం ప్రగతి భవన్‌లో నియంత్రిత సాగుపై జరిగిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి

సమావేశంలో సీఎం సూచనలివీ...
►ఈ వర్షాకాలం నుంచే రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనే లెక్కలు తీయాలి. 

►నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు వచ్చే నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు, సింగిల్‌ విండో చైర్‌పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచులను ఈ సదస్సులకు ఆహ్వానించాలి. 

►ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేయాలనే విషయం ముందే నిర్ధారిస్తారు. ఆ పంటలకు సరిపడా విత్తనాలను ముందే గ్రామాలకు చేర్చాలి. విత్తనాభివృద్ధి సంస్థ ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరించాలి.

►మంచి వంగడాలు తయారు చేయడానికి, మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ కమిటీలను త్వరలో నియమిస్తాం.

►రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడం కోసమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో ప్రభుత్వం సెజ్‌లను ఏర్పాటు చేస్తోంది. రైసు మిల్లులు, దాల్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు, ఇతర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు వస్తాయి. ఈ సెజ్‌ల పక్కనే గోదాముల నిర్మాణం చేపట్టాలి. సెజ్‌లు, గోదాములున్న ప్రాంతంలో ఇళ్ల లేఔట్‌కు అనుమతి ఇవ్వొద్దు.

►కల్తీ విత్తన వ్యాపారుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. అలాంటివారిని గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేసి, జైలులో వేయాలి. ప్రజా ప్రతినిధులెవ్వరూ కల్తీ విత్తన వ్యాపారులను కాపాడే ప్రయత్నం చేయొద్దు. 

►ఈ నెల 25లోగా ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల నియమాకం పూర్తిచేయాలి.

►గోదావరి ప్రాజెక్టుల కింద సత్వరం నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక వరి రకాలు సాగు చేయాలి. కృష్ణా ప్రాజెక్టు పరిధిలో ఆలస్యంగా నీరు వచ్చే ప్రాంతాల్లో స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలి. 

►పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. తెలంగాణలోనే కోటి బెయిళ్ల సామర్థ్యం కలిగిన 320 జిన్నింగు మిల్లులున్నాయి. 70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా మద్దతు ధరకు ఢోకా ఉండదు. పత్తి ఎక్కువ పండి, జిన్నింగ్‌ మిల్లులు లేని ప్రాంతాలు గుర్తించి, అక్కడ కొత్త మిల్లులు వచ్చేలా పరిశ్రమల శాఖ చొరవ చూపాలి. 

►రాష్ట్రంలో పచ్చి రొట్ట ఎరువు సాగును ప్రోత్సహించాలి. 

►జిల్లాలవారీగా అగ్రికల్చర్‌ కార్డును రూపొందించాలి. దాని ప్రకారమే పంటలను సాగు చేయాలి.

►జిల్లా, మండల, గ్రామాల వారీగా హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పాడి ప్లాంటేషన్‌ మిషన్స్‌ తదితర వ్యవసాయ యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలి. 

►అన్ని జిల్లాల్లో భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

►జిల్లా, డివిజన్, మండల, క్లస్టర్‌ స్థాయి వ్యవసాయ అధికారులకు ప్రతీ నెలా వాహన అలవెన్సు/ప్రయాణ భత్యం ఇవ్వాలి. 

► మార్కెట్లలో వెంటనే పసుపు యార్డులు తెరిచి, క్రయ విక్రయాలు కొనసాగించాలి.

మరిన్ని వార్తలు