ఘుమ ఘుమల వెనుక.. ఘాటైన నిజాలు..!

15 Dec, 2018 10:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నోరూరే వంటకాలు.. తింటే బేజారు..

ఆహార నాణ్యత ప్రశ్నార్థకం

బిర్యానీలో నిషేధిత రంగుల వాడకం

హోటళ్లలో నిల్వ మాంసంతో వంటకాల తయారీ

జాడలేని ప్రజారోగ్య, ఆహారభద్రత తనిఖీలు

జిల్లాలో అడుగడుగునా ప్రమాణాలకు పాతర

నోరూరించే రుచులు.. ఘుమ ఘుమలాడే సువానలు.. పెద్దపెద్ద హోటళ్లు.. ఫుట్‌పాత్‌లపై ఉండే హోటళ్లు.. భోజనశాలల్లో వంటకాలను చూస్తే ఆగలేని పరిస్థితి. ఈ జిహ్వాచాపల్యాన్ని కాస్త అదుపుచేసుకోకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. తింటున్న మాంసం మంచిదేనా.. అంటే..? ఏమో అని దిక్కులు చూడాల్సిన పరిస్థితి జిల్లాలో పలుచోట్ల ఎదురవుతోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా మాంసాహారాన్ని నిల్వ ఉంచుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిల్వ మాంసానికే రంగులద్ది మళ్లీమళ్లీ నూనెలో వేయించి.. వేడివేడిగా పొగలు కక్కిస్తూ వడ్డిస్తున్నారు. వాటిని ఎక్కువగా తినేవారిపై ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి. 

సాక్షి, సూర్యాపేట : మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జిల్లాలో అధిక శాతం బయటి తిళ్లకు మక్కువ చూపుతున్నారు. అన్ని రోజుల్లోనూ మాంసాహారానికి గిరాకీ ఉంటుంది. ఇదే అదునుగా రోగాలభారిన పడిన జంతువుల మాంసాన్ని సైతం వంటకాల్లో కలిపేస్తున్నారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ పట్టణాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అడ్డగోలు వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. నిల్వ మాంసంతో పాటు నాసిరకం నూనెలు, అనుమతిలేని రంగులు మితిమీరి వాడకం ఎక్కువైపోయింది.

నాణ్యత ప్రశ్నార్థకం..
నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీ, నగర పంచాయతీలు, పంచాయతీల్లో జంతువధ శాలల నిర్వహణ సమర్థంగా సాగాలి. మూగజీవాలను వధించే ముందురోజు వాటి ఆరోగ్య పరిస్థితి పరీక్షించి, అంతా సవ్యంగా ఉంటేనే వధించాలి. జిల్లాలో చూస్తే జంతువధ శాలల్లో ఒకటిరెండు ముద్రలు వేయించుకుని, తెరవెనుక మిగిలినవి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్నవీ విక్రయించేస్తున్నారు. కోడి మాంసం విక్రయించే దుకాణాల్లో కనీస శుభ్రత ఉండడం లేదు. అదే నీటిలో పదేపదే కోళ్లను కడగడం.. చర్మం తీసి అందులోనే ఎ క్కువ సేపు ఉంచడంతో బ్యాక్టీరియా సోకే ఆస్కా రం ఉంటోంది. దుకాణాల్లో కనీస రక్షణగా అద్దాలు.. జాలీలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వేలాడదీసిన మాంసంపై ఈగలు వాలుతున్నాయి. ధుమ్ము దూళి తాకి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. వండిన వంటకాలదీ అదే పరిస్థితి

జాడలేని అధికారుల తనిఖీలు
జిల్లాలో పలు హోటళ్లలో మాంసం నిల్వలో ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు.. కొన్ని చోట్ల మాంసం బూజుపట్టడం.. నిషేధిక రంగుల వాడకాన్ని వినియోగిస్తున్న హోటళ్లపై నిఘా ఉంచాల్సిన సంబంధిత శాఖ అధికారులే జాడ లేకుండా పోయింది. కేవలం నెలకోమారు వారికి అవసరమున్నప్పుడే మాత్రమే పెద్దపెద్ద హోటళ్లతో కుమ్మకై వసూళ్లు చేసుకొని వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. కొన్ని హోటళ్ల నుంచి ఏకంగా మామూళ్లు వసూళ్లు చేసుకొని వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలోని హోటళ్లతో పాటు జాతీయ రహదారిపై ఉన్న దాబా హోటళ్లను తనిఖీ చేయాలని ఆహారప్రియులు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు