ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కుదింపు

27 May, 2017 00:53 IST|Sakshi
ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కుదింపు

గతేడాది కంటే 7 లక్షల టన్నులు తగ్గుదల
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వ్యవసాయ సీజన్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. 2016–17 వ్యవసాయ సీజన్‌లో 97.41 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో 90.89 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గించింది. 2017–18 వ్యవసాయ ప్రణాళికలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ ప్రణాళిక త్వరలో విడుదల కానుంది. మొత్తం ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం 2016–17లో 87.60 లక్షల ఎకరాలు లక్ష్యంగా ఉండగా, ఈసారి 81.25 లక్షల ఎకరాలకు తగ్గించాలని నిర్ణయించడం వల్లే వాటి ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా తగ్గించారు.

ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గి పత్తి సాగు విస్తీర్ణం పెరిగే పరిస్థితి ఉండటంతో ఈ లక్ష్యాలను ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆహారధాన్యాల్లో కీలకమైన వరి ఉత్పత్తి లక్ష్యం మాత్రం గతేడాది కంటే పెరిగింది. 2016–17లో వరి ఉత్పత్తి లక్ష్యం 55.43 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 2017–18లో 58.11 లక్షల టన్నులకు పెంచారు. 2.68 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికంగా ఉత్పత్తి చేయాలన్నది ఉద్దేశం. కానీ పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం మాత్రం తగ్గింది. 2016–17లో పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 5.78 లక్షల మెట్రిక్‌ టన్నులుండగా, ఈసారి 4.69 లక్షల మెట్రిక్‌ టన్నులకు పరిమితం కానుందని వ్యవసాయ ప్రణాళిక వెల్లడించింది.

మరిన్ని వార్తలు